ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్ రాజు

Share Icons:
టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌ రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్లల‌ను ద‌త్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన గ‌ట్టు స‌త్తయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో క‌న్నుమూశారు. భ‌ర్తపై బెంగ‌తో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం మృతిచెందారు. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్‌ అనాథ‌ల‌య్యారు.

ఈ విష‌యాన్ని ఓ న్యూస్ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర‌రావు.. స‌ద‌రు గ్రామ స‌ర్పంచ్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి ఎర్రబెల్లి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు దిల్‌ రాజు. త‌న కుటుంబం స్థాపించిన ‘మా ప‌ల్లె’ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లల‌ను దత్తత తీసుకున్నారు.

2018లో ఈ ‘మా పల్లె’ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా పిల్లల బాగోగులును చూసుకుంటాన‌ని దిల్‌ రాజు తెలియ‌జేశారు. అడ‌గ్గానే అనాథ‌ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజుని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అభినందించారు. ఈ మేరకు దిల్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వరుస పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్’ ప్రధానమైనది. ఇది కాకుండా, నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కాంబినేషన్‌లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వి’ మూవీని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే, దర్శకుడు వి.వి.వినాయక్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘సీనయ్య’ సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాను ప్రకటించారు. మరోవైపు, ‘హిట్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. మొత్తానికి వచ్చే రెండు మూడేళ్లలో రాజు గారు ఫుల్ బిజీ.