ముంబయి ఇండియన్స్ జట్టులోకి అర్జున్ టెండూల్కర్..? నెట్స్‌లో బౌలింగ్

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్ కోసం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ని జట్టులోకి ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ తీసుకోబోతుందా..? ఇప్పటికే యూఏఈకి చేరుకున్న అర్జున్ టెండూల్కర్ క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని ముంబయి జట్టుతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ఆ టీమ్ ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ తదితరులతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో అర్జున్ టెండూల్కర్ సేద తీరుతున్న ఫొటో వెలుగులోకి వచ్చింది. కానీ ముంబయి జట్టులోకి అర్జున్‌ని తీసుకున్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆగస్టు 20న టోర్నీలోని ఎనిమిది టీమ్స్‌ అక్కడికి చేరుకున్నాయి. అలా యూఏఈకి వెళ్లే క్రమంలో అన్ని జట్లు కూడా తమతో పాటు నెట్స్‌ బౌలర్లని కూడా కొంత మందిని తీసుకెళ్లాయి. దాంతో.. నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు అర్జున్ కూడా ముంబయి టీమ్‌తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ.. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ గోప్యంగా ఉంచింది.

ఐపీఎల్ టోర్నీ సమయంలో ఏ క్రికెటరైనా గాయపడితే..? అతని స్థానంలో మరొక ఆటగాడ్ని తీసుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పిస్తోంది. కానీ.. అతను వేలంలోకి వచ్చి ఉండాలనేది గత ఏడాది వరకూ ఒక రూల్‌గా ఉండేది. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వేలంలోకి రాకపోయినా సదరు ఆటగాడు యూఏఈలో ఉండి బయో- సెక్యూర్ బబుల్ పరిధిలో ఉంటే తీసుకోవచ్చని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో.. ముంబయి ఇండియన్స్ టీమ్‌లోకి అర్జున్ టెండూల్కర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.