మళ్లీ టాలీవుడ్‌కు సిద్ధార్థ్: శర్వానంద్‌తో ఢీ.. మల్టీస్టారర్‌గా ‘మహాసముద్రం’

Share Icons:
హీరోగా ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ విలన్‌గా నటించనున్నట్టు గత కొద్ది రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ వదంతులను నిజం చేస్తూ శుక్రవారం చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. ‘మహాసముద్రం’లో సిద్ధార్థ్ నటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో శర్వానంద్‌తో కలిసి నటించడానికి సిద్ధార్థ్ అంగీకరించినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓయ్’ వంటి హిట్ సినిమాలతో సిద్ధార్థ్ తెలుగులో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే, ఆ తరవాత వరుసపెట్టి డిజాస్టర్లు రావడంతో సిద్ధార్థ్ తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే, అప్పుడప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు సిద్ధార్థ్. ఆయన చివరిగా డబ్బింగ్ మూవీ ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల‌ ముందుకు వచ్చారు. ఇప్పుడు చాలా కాలం తరవాత ఒక తెలుగు సినిమాను అంగీకరించారు.

Also Read:

ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల‌ని ఎదురుచూస్తున్న సిద్ధార్థ్.. ఎట్టకేల‌కు ‘మ‌హాస‌ముద్రం’ లాంటి స్క్రిప్టు రావ‌డంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజ‌య్ భూప‌తి రాసిన ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో రూపొందే ఈ సినిమాలో ఇద్దరు ప్రతిభావంతులైన న‌టులు శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌ పోటీపడనున్నారు. సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ బాబుతో ‘స‌రిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్‌ బ‌స్టర్‌ను నిర్మించిన ఎ.కె. ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ.. ఇప్పుడు ‘మ‌హాస‌ముద్రం’ను నిర్మిస్తోంది. సుంక‌ర రామ‌బ్రహ్మం నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రతి వారం ఒక ప్రకటన రానుంది.