మన తెలుగు సామెతలు (‘అ’ అక్షరంతో)

Share Icons:

మన తెలుగు సామెతలు (‘అ’ అక్షరంతో)

అంకపొంకాలు లేనిది శివలింగం
అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి
అంకెకు రాని ఆలి – కీలెడలిన కాలు
అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు
అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని
అంగట్లో అరువు – తల మీద బరువు
అంగట్లో అష్ట భాగ్యం – అల్లుని నోట్లో అష్ట దరిద్రం
అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది
అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు
అంగడి బియ్యం – తంగేటి కట్టెలు
అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి
అంగిట బెల్లం – ఆత్మలో విషం
అంగిట విషం – మున్నాలిక తియ్యదనం
అంచుడాబేగానీ పంచడాబు లేదన్నట్లు
అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు
అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట
అంటే ఆరడి – అనకుంటే అలుసు
అండలుంటే కొండలు దాటవచ్చు
అండలేని వూళ్ళో వుండ దోషం – ఆశలేని పుట్టింట అడగ దోషం
అండ వున్నవానిదే అందలం
అంత వురిమీ యింతేనా కురిసేది!
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత
అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?
అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?
అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు
అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?
అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు
అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు
అందం చందం నావంతు – ముద్దూ మురిపెం నీవంతు అన్నదట
అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు
అందని ద్రాక్షపండ్లు పుల్లన
అందముంటే సరా! అదృష్టముండొద్దూ!
అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు
అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు
అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు
అందరికీ అన్నం పెట్టే వాడు రైతే
అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ
అందరినీ మెప్పించడం అలవి గాని పని
అందరూ అందల మెక్కేవారే, మోసే వారెవరు?
అందరూ ఒక ఎత్తు – అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోయినాయ్‌
అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది
అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు
అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట
అందాలు నావి – సంబరాలు నీవి అందిట
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
అందితే తియ్యన అందకుంటే పుల్లన
అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు
అంధునికి అద్దం చూపినట్లు
అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు
అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు
అంబలి త్రాగేవాడికి మీసాలెత్తే వాడొకడా?
అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు
“అ – ఆ” లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట
అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము
అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు
అక్క కాపురం అడగక్కర లేదు – చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు
అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు
అక్క పగ, బావ మంచి
అక్క మనదైతే బావ మన వాడవుతాడా?
అక్క మొగుడు కుక్క
అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ – అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ
అక్కరకురాని చుట్ట మెందుకు?
అక్కరకు వచ్చినవాడే మనవాడు
అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు
అక్కరకు రానిది అవనిలో లేదు
అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం
అగసాలిని, వెలయాలిని నమ్మరాదు
అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు
అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది
అగ్గిమీద గుగ్గిలం లాగా
అగ్గువ అయితే అంగడికి వస్తుంది
అగ్గువ కొననీయదు ప్రియం అమ్మనీయదు
అగ్నికి వాయువు తోడైనట్లు
అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు
అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు
అగ్నిలో ఆజ్యం పోసినట్లు
అగ్నిలో మిడత పడ్డట్లు
అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు
అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది
అచ్చట్లు – ముచ్చట్లు – ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు
అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు
అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు
అచ్చు పోసిన ఆఁబోతువలె
అజీర్ణానికి లంఖణం మందు
అటైతే కందిపప్పు – యిటైతే పెసరపప్పు
అటైతే వైద్యకట్నం – యిటైతే వైతరిణీ గోదానం
అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు
అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి
అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు
అడకత్తెరలో పోకచెక్కవలె
అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడన్నట్లు
అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది
అడగనిదే అమ్మయినా పెట్టదు
అడవి ఉసిరికాయకు, సముద్రపు ఉప్పుకు జత కలసినట్లు
అడవి పత్రి – వాన నీరు
అడవి గాచిన వెన్నెల – ముదిమిన చేసిన పెళ్ళి ఒక్కటే
అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు
అడిగిందే పాపం – అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు
అడిగింది రొట్టె – యిచ్చింది రాయి
అడిగితే చిరాకు – అడగకపోతే పరాకు
అడిగేటంత అన్యాయానికి లోబడతానా?
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అడవిలో పడ్డట్లుగా
అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు
అడుక్కుతినేవాడికి అరవై ఆరు కూరలు
అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు
అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప
అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది
అడుగు దాటితే అక్కర దాటుతుంది
అడుగున ఎరువుకొద్దీ పైన పంట బంగారం
అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు
అడుసు త్రొక్కనేల – కాలుకడగనేల?
అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు బిడ్డలా?
అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు?
అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు?
అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట
అడ్డేటు మీద గుడ్డేటు
అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న
అత్యాశ నిత్య దరిద్రం
అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది?
అతి చేస్తే మతి చెడుతుంది
అతితెలివికి ఆకలెక్కువ
అతితెలివికి మగబుద్ధి అన్నట్లు
అతిరహస్యం బట్టబయలు
అతివినయం ధూర్త లక్షణం
అతివృష్టి – అనావృష్టి
అతివృష్టయినా అనావృష్టయినా ఆకలిబాధ తప్పదు
అతి సర్వత్ర వర్జయేత్‌
అతి సుకుమారం – కటిక దరిద్రం
అతుకుల కాపురం – చితుకుల మంట
అతుకుల బొంత – గతుకుల బాట
అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా?
అత్త అప్పుతీరే – అల్లునికి భ్రమతీరే
అత్త కాలము కొన్నాళ్ళు – కోడలి కాలము కొన్నాళ్ళు
అత్తకు అల్లుడాశ – అల్లుడికి అత్తాశ
అత్తకు మంచి లేదు – చింతకు పచ్చి లేదు
అత్తకు మొగుడు అల్లుడు
అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట
అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ
అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు
అత్తను ఉంచుకున్నవాడు ఆయుష్మంతుడు
అత్తను కొట్టి అటకెక్కింది – మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది
అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు
అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు
అత్త మంచీలేదు – వేప తీపీలేదు
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
అత్తముండ కన్న ఉత్తముండ మేలు
అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు
అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట
అత్త లేని కోడలుత్తమురాలు – కోడలు లేనత్త గుణవంతురాలు
అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు
అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి
అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు
అత్తవారింటి లేమి అల్లుడెరుగు
అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
అత్తా ఒకింటి కోడలే – మామా ఒకింటి అల్లుడే
అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే
అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది
అతి తెలివి అరవై రకాలు
అతిథి కోసమే తిథులు వున్నట్లు
అదును లేని పైరు – ముదిమిలోని బిడ్డ ఒక్కటే
అదుగో అంటే ఆరునెలలు
అదుగో పులి అంటే యిదిగో తోక అన్నట్లు
అదును గాని పదును
అదును చూచి పొదలో చల్లినా పండుతుంది
అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు వేయాలి
అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పును విడవాలి
అదుపులేని గుర్రాలు అగడ్తలు దాటుతాయా?
అదృష్టం వుంటే పోయిందికూడా చేతికి వస్తుంది
అదృష్టం చెప్పిరాదు – దురదృష్టం చెప్పిపోదు
అదృష్టం పండితే ఆరు నూరవుతాయి
అదృష్టవంతుడ్ని చెరిపేవారూ, దురదృష్టవంతుడ్ని బాగుచేసేవారూ లేరు
అద్దం మీద అలిగి ముక్కు కోసుకున్నట్లు
అద్దం మీద ఆవగింజ పడ్డట్టు
అద్దంలో చూసుకుంటూ అందం అడిగినట్లు
అద్దంలోని మూట అందిరాదు
అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా?
అధమునికి భార్య అయ్యేదానికన్నా బలవంతునికి బానిసయ్యేది మేలు
అధికారం ఆరుపాళ్ళు – అహంకారం అరవై పాళ్ళు
అధికారం బంగారు గొలుసుల పంజరం
అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌
అధికారి మూరెడు – బంటు బారెడు
అధికాశ లోక దరిద్రం
అనంతయ్య చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నట్లు
అనగా అనగా రాగం – తినగా తినగా రోగం
అని అనిపించుకోవలెనా అత్తగారూ!
అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు
అనుభవం ఒకరిది – ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివి
అనుమానం ప్రాణ సంకటం / అనుమానం పెనుభూతం
అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది
అనువు గాని చోట అధికుల మనరాదు
అనువుగాని చోట పుండు – అల్లుడి వైద్యం
అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది
అనూరాధకు తడిస్తే మనోరోగాలు పోతాయి
అనూరాధలో అడిగినంత పంట
అనూరాధలో తడిస్తే ఆడది మగాడౌతుంది
అన్నం అరిగిపోతుంది – ఆదరణ శాశ్వతంగా వుంటుంది
అన్నం కన్నా ఆదరణ ముఖ్యం
అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు
అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు
అన్నం వండని ఆడదీ, మంచం నేయని మగవాడూ వుండడు
అన్నం తిన్నవాడూ, తన్నులు తిన్నవాడూ మరచిపోరు
అన్నం పెట్టిన చెయ్యిని నరికినట్లు
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు
అన్నదీక్షే కానీ అక్షర దీక్ష లేదు
అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావు
అన్నప్రాశన నాడే ఆవకాయా?
అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట
అన్నవారూ, పడినవారూ బాగున్నారు, మధ్యవారు పడిచచ్చారు
అన్నానికి పదును తప్పినా – భూమికి అదును తప్పినా పనికిరావు
అన్ని కార్తెలు తప్పినా హస్త కార్తె తప్పదు
అన్ని దానాలలో అన్నదానం మిన్న
అన్ని పైర్లకూ ఆషాఢం
అన్ని రోగాలకు వాతలు పెట్టే వైద్యుణ్ణి దూరంగావుంచాలి
అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు
అన్నీ అయిన తర్వాత అగ్ని వైద్యం
అన్నీ వున్న విస్తరి అణిగి వుంటే ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడిందిట
అన్నీ ఉన్నా అయిదవతనం లేదు
అన్నీతెలిసినవాడు అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనివాడు ఏకాదశినాడు చచ్చాడు
అన్నీ పండించిన రైతుకు అన్నమే కరువు
అన్నీ సాగితే రోగమంత సుఖం లేదు
అన్యాయపు వూరిలో ఆలూ మగలకే రంకు
అన్యాయపు సంపాదన ఆవిరై పోతుంది
అపనింద అవతలకిపోతే, నింద వచ్చి తలమీద పడిదట
అపుత్రుడికి గతి లేదు
అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది
అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట
అప్పటి కోపం అన్యాయ మెరుగదు
అప్ప సంపాదించిన ఆస్థి మనుమడితో మట్టిపాలు
అప్పిచ్చే నాకొడుకుంటే దొంగతనం ఎందుకు?
అప్పు అదనుకు, ఆకటికీ రాదు
అప్పు ఆదా కాదు – వాపు బలుపూ కాదు
అప్పు ఆరు తెన్నులు – ముప్పు మూడు తెన్నులు
అప్పు యిచ్చి చూడు – పిల్ల నిచ్చి చూడు
అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు
అప్పు చేసి కొప్పు తీర్చినట్లు
అప్పు చేసి పప్పుకూడు
అప్పుడనే మాటను ఆర్నెల్లు ఆగి అనాలి
అప్పులున్నవాడి వెంట, చెప్పులున్నవాడి వెంట వెళ్ళరాదు
అప్పులెందుకు మిగిలాయిరా అంటే ఎగ్గొట్టటం చేతకాక అన్నాడట
అప్పు లేని గంజి గరిటడే చాలు
అప్పులేనిదే ఒక సంపద / ఐశ్వర్యం
అప్పులేని మనిషి – పిప్పిలేని పగడం ఉంటాయా?
అప్పు లేనివాడే అధిక బలుడు / పుణ్యాత్ముడు
అబద్ధం అంటే అతుకుల మాట
అబద్ధం చెబితే అన్నం పుట్టదు – నిజం చెబితే నీళ్ళు పుట్టవు
అబద్ధమాడితే గోడ కట్టినట్లుండాలి
అబద్ధానికి అంతు లేదు
అబద్ధాల మనిషికి అరవై నాలుగు అసత్య ప్రమాణాలు
అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారట
అబ్బ నుయ్యి త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించినట్లు
అబ్బాయి ఆర్భాటం, ఆయాసమే గానీ కడుపు పండేది లేదు
అబ్బలేని బిడ్డ – గట్టులేని చేను
అబ్బురాన బిడ్డ పుట్టింది – గడ్డపలుగు తేరా చెవులు కుడదాం అన్నట్లు
అభాగ్యునికి ఆకలెక్కువ – నిర్భాగ్యునికి నిద్రెక్కువ
అభ్యాసం కూసు విద్య
అభిరుచులా మస్తు – అంగస్తంభన నాస్తి
అమరితే ఆడది – అమరకుంటే గాడిద
అమావాస్యకు అట్లు – పున్నానికి బూరెలు
అమ్మ కడుపు చూస్తుంది – భార్య జేబు చూస్తుంది
అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
అమ్మకు నోటి వాడి – అయ్యకు చెయ్యి వాడి
అమ్మ గూటికి – అయ్య కాటికి
అమ్మ గృహ ప్రవేశం – అయ్య అగ్ని ప్రవేశం
అమ్మ దగ్గర క్రింద పడుకున్నా – అయ్య దగ్గర నేల పడుకున్నా ఒక్కటే
అమ్మ తాను పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదన్నట్లు
అమ్మ దీవెన ఆకాశమంత – దేవుడి దీవెన దీపమంత
అమ్మన్న అమ్మకు మొగుడు – తిమ్మన్న తల్లికి మొగుడు
అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక
అమ్మ పుట్టిల్లు – మేనమామ దగ్గరా?
అమ్మ పెంచిన బిడ్డా? అయ్య పెంచిన బిడ్డా?
అమ్మ పెట్టెవి నాలుగూ పెడితే గానీ కుదరదు
అమ్మబోతే అడవి – కొనబోతే కొరివి
అమ్మ మంచిదే – తెడ్డే మంచిది కాదు
అమ్మవారి మొక్కు, ఆడబిడ్డ అప్పు తీరవు
అమ్మా నాన్నా ఆర్భాటమే కానీ నాకు చదువొస్తుందా?
అమ్మాయి పరువాలు అబ్బయికి పండుగ అన్నట్లు
అమ్మాయి పుట్టిందంటే ఆయువు సగం క్రుంగిందన్నమాటే
అయ్యకు రెండు గుణాలే తక్కువ – తనకు తోచదు, చెబితే వినడు
అయ్యకు వణుకు ప్రాయం – అమ్మకు కులుకు ప్రాయం
అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు
అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?
అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట
అయ్య దేశ సంచారం – అమ్మ గ్రామ సంచారం
అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా?
అయ్యవా రంతంత – అయ్యవారి పెళ్ళాం ముంతంత
అయ్యవా రటికంత – అయ్యవారి పెళ్ళాం పుటికంత
అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు
అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటుంటే, అమ్మగారు పారపోయనూ ఎత్తనూనట
అయ్యిందమ్మా పెళ్ళి అణిగిందమ్మా రంధి
అయితంపూడి ఉద్యోగం అయితే గియితే,
ఆరావుల పాడి చేస్తే గీస్తే పెరుగు,
పాలు మా వాళ్ళకి పోస్తావా? మీవాళ్ళకి పోస్తావా?
అంటూ పెళ్ళాన్నడిగాడట
అయితే అవతల ఒడ్డు లేకపోతే ఇవతల ఒడ్డు
అయితే ఆడబిడ్డ లేకపోతే మొగబిడ్డ
అయితే ఆదివారం లేకపోతే సోమవారం
అయితే అమీరు లేకపోతే ఫకీరు
అయిదవతనం లేని అందం అడుక్కు తిననా?
అయిదు శిఖలున్నా యిబ్బందిలేదు కానీ మూడుకొప్పులు చేరాయంటే ముదనష్టమే
అయినకాడికి జమాబందీ
అయినవాణ్ణి అడిగేకంటే కానివాడి కాళ్ళు పట్టుకోవడం మంచిది
అయిన పెళ్ళికి మేళాలా?
అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట
అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు
అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ
అయోమయం అడవి మొద్దు
అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది
అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు
అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా?
అరగని కూడు – జరగని మాట
అరఘడియ భోగం – ఆరు నెలల రోగం
అరిచే కుక్క కరవదు
అరచేత వెన్న పట్టుకొని నేతి కోసం ఏడ్చినట్లు
అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్లు
అరచేతిలో వైకుంఠం చూపినట్లు
అరచేవాడి పంచన చేరవచ్చు గానీ, నాలిముచ్చు గడప త్రొక్కరాదు
అర్ధరాత్రి యుద్ధం ఎక్కడంటే మల్లెల మంచం మీద అన్నదట
అరటి కఱ్ఱు – జ్ఞాతి గుఱ్ఱు పోవు
అరటికాయ ఆరు నెలల రోగం
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు
అరణం కంటే మరణమే మేలు మగాడికి
ఆరణ్య రోదనం లాగ
అరనిమిషం తీరికలేదు – దమ్మిడీ ఆదా లేదు
అరమనిషి సత్తువ – ఆరుగురి కోపం
అరవ లేని దేశం – కాకి లేని వూరు లేదు
అరవై ఆరు పిండివంటలూ ఆవు చంటిలోనే వున్నాయి
అరవై వూళ్ళ అమలుదారు ఆలికి దాసుడు
అరవైఏళ్ళునిండినవాని ఆలోచన అడక్కు – ఇరవైఏళ్ళు నిండనివానికి పెత్తనం ఈయకు
అరవైఏళ్ళ అన్నంభొట్లు అద్దాన్ని చూచి బిద్దం అంటే వాళ్ళమ్మకు ఆశ్చర్యం వేసిందట
అరవై వరహాలిచ్చినా అత్తవంటి బానిస దొరకదు
అరిశె ఆరు నెలల రోగం బయట పెడ్తుంది
అరిశెల పాకం – అత్త పాకం తెలుసుకు మసలాలి
అరుంధతీ, గిరుంధతీ కనపడ్డంలేదు గానీ అప్పు మాత్రం కనబడుతోంది అన్నాడట
అరువు సొమ్ము బరువు చేటు
అరువుగా యిస్తానంటే ఆరు ఏనుగులు పంపమన్నట్లు
అర్ధంకాని మాట – అల్లిబిల్లి మాట
అర్ధబలం కంటే – అంగబలం ముఖ్యం
అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు
అర్ధరాత్రివేళ మద్దెల దరువులు అన్నట్లు
అర్జీలకు పనులూ కావు – ఆశీర్వచనాలకు బిడ్డలూ పుట్టరు
అలంకారం కంటే అయిదవతనం మేలు
అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు
అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు
అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు?
అలక మీరితే అమృతమైనా విషమే
అలికిన యింట ఒలికినా అందమే
అలిగే బిడ్డతోనూ – పొడిచే గొడ్డుతోనూ కష్టం
అలిగి అత్తవారింటికి – చెడి చెల్లెలింటికి పోరాదు
అలుపుల మాటే లేదు గెలుపుల వూసేలేదు రసరాజ్య జాతరలో అన్నట్లు
అల్పవిద్యా మహాగర్వీ
అల్ప విద్వాంసుడు ఆక్షేపణలకు పెద్ద
అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
అల్పుని చేరదీస్తే అధిక ప్రసంగం – కుక్కను చేరదీస్తే మూతి నాకుడు
అల్లుడని పేరుపెట్టి పుల్ల విరిచి వేస్తే ఎగిరి పడుతుంది
అల్లుడా ఎప్పుడొచ్చావని అడిగితే రాత్రి వండిన గారెల సంగతి చెప్పనా అన్నాడట
అల్లుడి కత్తికి రెండు వైపులా పదునే
అల్లుడికి చేసినవంట అతిథికి కూడా వచ్చినట్టు
అల్లుడికి నెయ్యి లేదు అల్లుని వెంట వచ్చిన వానికి నూనె లేదు
అల్లుడికి పెట్టినట్లు కొడుక్కి పెడితే యిల్లు గుల్లవుతుంది
అల్లుడి గుణం అనుభవంలో గానీ తెలీదు
అల్లుడితో గిల్లుడన్నట్లు
అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు
అల్లుడంటే చాలు – వంకర తాడి కూడా నిఠారుగా నుంచుంటుందట
అల్లుడలిగితే కూతుర్ని తీసుకుపోతాడు అంతేగా?
అల్లుడికి బెట్టు – యిల్లాలికి గుట్టు వుండాలన్నట్లు
అల్లుడు చుట్టమూ గాదు – ఆముదపు చెట్టు చెట్టూకాదు
అల్లుడు దశమగ్రహం
అల్లుని గుడ్డి తెల్లవారితే తెలుస్తుంది
అవలక్షునికి అక్షింతలిస్తే అవతలికెల్లి నోట్లో పోసుకున్నాడట
అవతార పురుషుడు అమ్మల్లుడు – అంతకంటే చక్కని వాడు పిన్నల్లుడు
అవివేకితో చెలిమికంటే – వివేకితో విరోధం మేలు
అవ్వకు ఆవలింతలు నేర్పినట్లు
అవ్వను పట్టుకొని వసంతాలాడినట్లు
అవ్వా కావాలి – బువ్వా కావాలి
అశుద్ధం మీద రాయి వేస్తే ముఖమంతా చిందుతుంది
అశ్వత్థ ప్రదక్షిణం చేసి కడుపు తడిమి చూసుకున్నట్లు
అశ్వమేధ యాగం చేయవచ్చుగానీ ఆడపిల్ల పెళ్ళి చేయలేం
అశ్వని కురిస్తే అంతా నష్టం
అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు
అష్ట భాగ్యాలున్నా అత్తగారిల్లే – పురిటి కూర తిన్నా పుట్టిల్లే
అసత్యం సంపాదించిన పలుకుబడి సత్యం బయటపడే వరకే
అసత్యం చెప్పటం పిరికి లక్షణం
అసలు కంటే వడ్డీ ముద్దు
అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు
అసలు పిసలయ్యే, గొంగళి భారమయ్యె
అసలు మూడు పాళ్ళు, వడ్డీ ఆరుపాళ్ళు
అసలే అయోమయం అందులో అంధకారం
అసలే కోతి, దానికి తోడు కల్లు త్రాగింది ఆ పైన తేలు కుట్టింది
అసిమిలో దొకటి, అమ్మేదొకటి
అసూయ ముందు – ఆడది వెనకాల

Leave a Reply