మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్‌తో వార్నర్ షాక్

Share Icons:
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత ఫీల్డర్ కళ్లు చెదిరే క్యాచ్‌ని అందుకున్నాడు. 341 పరుగుల లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ (15: 12 బంతుల్లో 2×4).. మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని పాయింట్- కవర్‌‌‌కి మధ్యలో ఫీల్డింగ్ చేస్తున్న మనీశ్ పాండే తలపై బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. అద్భుత రీతిలో గాల్లోకి ఎగిరిన మనీశ్ పాండే ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో.. వార్నర్ కూడా కాసేపు నమ్మలేనట్లు క్రీజులో ఉండిపోయాడు.

వాంఖడే వన్డేలో రిషబ్ పంత్ గాయపడటంతో అతని స్థానంలో ఈ వన్డేకి అవకాశం దక్కించుకున్న మనీశ్ పాండే బ్యాటింగ్‌లో ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఈ కర్నాటక బ్యాట్స్‌మెన్ 4 బంతుల్లో 2 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ.. వాంఖడే వన్డేలో శతకంతో సూపర్ ఫామ్‌లో ఉన్న వార్నర్‌ క్యాచ్‌ని పట్టడం ద్వారా టీమిండియాలో ఉత్సాహం నింపాడు.

మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (96: 90 బంతుల్లో 13×4, 1×6), కేఎల్ రాహుల్ (80: 52 బంతుల్లో 6×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (78: 76 బంతుల్లో 6×4) నిలకడగా ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. కేన్ రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీశాడు.