మధ్యతరగతి మహిళ అంతర్మధనం -ఓ కథ

మధ్యతరగతి మహిళ అంతర్మధనం -ఓ కథ
Views:
33

నిజానినికి నిజంగా నాకు చాలా కోపంగా ఉంది, చికాకుగా, అసహనంగా, ఆవేశంగా ఏమి చెయ్యాలో తోచకుండా ఉంది. నన్ను ఎవరన్నా కదిలిస్తే కొట్టేస్తానేమో అన్నంత విసుగ్గా ఉంది. మనం మనకోసం కాక ఎవరికోసమో బతుకుతున్నట్లు ఎందుకీ దోబూచాట? ఎవరో ఎదో అనుకుంటారు అని ఎవరికోసమో మనమెందుకు తలవగ్గాలి మనకది తప్పు అనిపిస్తే తప్పు అంతే .. మనము చెప్పింది వింటునట్లుగా, మనం చెప్పిందానిలొ నిజాయితి ఉందని చెప్తూనే వాళ్ళు చేయాల్సింది చేసెసేవాళ్ళని చూస్తుంటే ఎంత అసహనం పెరిగిపోతుందంటే అసలెందుకిక మనం? మన మాటకి విలువ లేనప్పుడు అనిపిస్తుంది. ఏమిటీ పరిస్థితి? దీన్నెలా అధిగమించడం? ఎన్ని ప్రశ్నలో నా మదిలో .. ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు, సమాధానాలు రాని ప్రశ్నలు.”

******

పెళ్ళయి ఆరునెలలయింది ఒకవిధంగా ఇంకా కొత్త కోడల్నే , అత్తారింటి పరిస్థితులకి నెమ్మదిగా అలవాటు పడ్తున్నాను (పడుతున్నానా?) ఆడపడుచు పెళ్ళి మాటలు మాట్లాడుకుంటున్నారు. అంతకు ముందురోజే ఓంట్లో నలతగా ఉందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు శ్రీవారు, “మూడొనెల, జాగ్రత్తగా చూసుకొండి ” అని జాగ్రత్తలు చెప్పి పంపారు డాక్టరు. తొలి చూలు కదా మధ్యాహ్నం భోజనాలవగానే అక్కడే మంచం మీద పడుకుని ఉన్నాను. నేను పడుకున్నచోటే కుటుంబ సభ్యులంతా చేరి పెళ్ళి విషయాలు మాట్లాడుకుంటున్నారు.

“కాలి దాకా వచ్చిన సంబంధం కాశీ వెళ్ళినా దొరకదంటారు పిల్లాడు బాగున్నాడు మనమ్మాయికి సరి జోడే చేసేద్దాము ఇంకెన్నాళ్ళు మనదగ్గిర, ఏ అప్పో సొప్పో చేసి ఆ మూడు ముళ్ళూ వేయించేస్తే బాధ్యతలు తీరిపోతాయి. ” అని అత్తగారు అప్పటికే ఇద్దరి కూతుళ్ళ , కొడుకుల పెళ్ళిళ్ళు చేసి ఇక చివరాడపడుచుకి కూడా చేసేస్తే బాధ్యత తీరిపోతుంది కదా అన్న ఆలోచన + తొందరపాటు.

“మొన్నేగా రెండోదానికి చేసాము మళ్ళీ ఇప్పుడు దీనికంటే కష్టమేమో, ఇప్పటికే ఇంటి చుట్టూ అప్పులు చేసి ఉన్నాము” మావగారు.

“అమ్మాయి పెళ్ళన్న తరువాత అప్పులుండవా? అప్పులున్నాయి కదా అని దీనికి పెళ్ళి చేయడం మానేస్తామా? మీరెన్నయినా చెప్పండి, అబ్బాయికి మనమ్మాయిని తప్పితే చేసుకోనంటున్నాడు, ఈ సంబంధం తప్పించేది లేదు. రేపే వెళ్ళి పెళ్ళికొడుకు తల్లితో మాట్లాడి రండి, ” అత్తగారి హుకుం.

ఆపాటికే మామగారు ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యుల అందరి సలహాలు తీసుకుంటున్నారు “చేసేద్దామా?” అని. అందరి అభిప్రాయం చేసేయ్యాలనే, అందరు చేసేద్దాము అని చెప్పేసరికి “సరే మాట్లాడి వస్తాను ఊళ్ళోనే ఉన్నారుగా” అని వెళ్ళబోతు వెనక్కి తిరిగి నన్ను చూసారు. వెళ్ళబోతు వెనక్కి తిరిగారేంటా అని అందరు అటువైపు చూసెంతలో వడి వడి గా నా దగ్గరికి వచ్చి “ఏంటమ్మా చేసేద్దామంటావా నీ అభిప్రాయమేంటి?” అని ఆగి నన్ను అడిగేసరికి ఒక్కసారిగా తత్తరపాటు వచ్చేసింది నాలో . అభిప్రాయాలు చెప్పడం నాకు కొత్త కాదు , నాన్నగారు లేకపోవడం వల్ల మా ఇల్లు చాలావరకు మా అభిప్రాయల మీదో, మా ఆలోచనలతోటో సాగిందని చెప్పొచ్చు, కాని అత్తారింట్లో మొదటిసారిగా అభిప్రాయ సేకరణ, అది ఇంకొకరి జీవితానికి సంబంధించి, “ఈ రోజు పప్పు ఏంటి? ఈరోజు కూర ఏమి చెయ్యను” అంటే టక్కున చెప్పొచ్చు కాని మీ ఆడపడుచుకి చేసుకోబోయే వరుడి విషయంలో నీ అభిప్రాయం అంటే? “ఏమ్మా మాట్లాడవు?” మళ్ళీ ఇంకోసారి మామగారి గొంతు.. “నాకేమి తెలుస్తుందండి, మీరన్ని ఆలోచిస్తారుగా మీ ఇష్టం కాని మరీ ఆ అబ్బాయి తల్లి రెండో బార్య అంటున్నారు ఆలోచించండి మావయ్యా?”

అప్పటిదాకా రెండో బార్య ఒక్కగానొక్క కొడుకు, ఆవిడ భర్త మొదటి బార్యని వదిలేయలేదు ఆమెతోనే ఉంటున్నాడు, ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు అన్నప్పుడే నా మనసులో ఎక్కడో చిన్న అపశృతిలాంటి ఆలోచన …. కొంచం పచ్చిగా మాట్లాడాలంటే ఉంచుకున్న ఆవిడకి పుట్టిన కొడుకు.. ఎందుకో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పటినుండి వాళ్ళ మాటలు వింటూ నాలో కలిగిన ఆ ఆలోచనని ఆయన అడగగానే చెప్పేసాను.

నా అభిప్రాయం వాళ్ళకంత పెద్ద కారణంగా కనిపించలేదో, మరి ఒక్కగానొక్క కొడుకు, తరగని ఆస్తి అని అనుకున్నారో, ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటాము మీ అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చేసింది అని వాళ్ళ అమ్మగారి మాటకి కట్టుబడ్డారో తెలీదు కాని, మొత్తానికి ఆ అబ్బాయి ప్రేమ ఫలించింది. మా ఆడపడుచు పెళ్ళి నిడారంబరంగా గుళ్ళో ఎదురు కట్నంతో (పెళ్ళి ఖర్చులు) జరిగింది.

పెళ్ళి కొడుకు చాలా బాగుంటాడు, సగటు మధ్య తరగతి కన్యల కలలో రాజకుమారుడని చెప్పొచ్చు. నిజానికి పెళ్ళికాని పిల్లలు కాస్త అసూయ చెందే అందగాడు ఆ అబ్బాయి , పైగా కోరి చేసుకున్నాడు, పెళ్ళి ఖర్చులు ఎదురిచ్చి మరీ .. ఇన్ని గుణాలతో మా ఆడపడుచు సొంతమైన అతన్ని చూసినప్పుడు.. ఒకవిధంగా నాలోని మధ్యతరగతి మనసు కూడా అసూయ చెందిందనే చెప్పొచ్చు. సర్దుకుపోడం అనేది చిన్నప్పటినుండి అలవాటయిన విద్య కాబట్టి , పైకి ఆ అసూయలని కనబర్చలేదు.

రోజులలా గడిచిపోయాయి, యుగాలు క్షణాల్లా అనొచ్చేమో మరి. వాళ్ళిద్దరి దాంపత్యం కూడా అంతే అన్యోన్యంగా సాగితూ.. కాల క్రమంలో నాకు ఇద్దరు మగ పిల్లలు, రెండో వాడు పుట్టిన నెలకి అత్తగారికి దేవుడి దగ్గరనుండి పిలుపొచ్చింది, అన్నాళ్ళు చక్రం తిప్పిన ఆవిడ అలుపొచ్చి ఇక నావల్లకాదని పిలుపందుకొని వెళ్ళారు. మా ఆడపడుచుకి ఒక బాబు. రెండోసారి నీళ్ళోసుకుందని తెలియగానే మా ఇంటికి వచ్చింది పురుడుకని. అత్తగారు లేరు అన్న బాధ తెలియకూడదని, ఒకవిధంగా నా సొంత చెల్లెలే అయితే…..అన్న ఆలోచన వచ్చి ఏమి కావాలంటే అది దగ్గరుండి చేసి పెట్టేదానిని. పెళ్ళి అయిన తరువాత అదే మొదటిసారేమో మా ఇంట్లో అన్ని రోజులు ఉండడం. ఒక్కొక్కటిగా మా తమ్ముడిగారయిన ఆవిడ శ్రీవారి అలవాట్లు బయటపడనారంభించాయి.

అంతవరకు చక్కటి సంపాదనాపరుడు, మంచి జీతం అసలు వాళ్ళకి లోటు లేదు అనుకున్న నేను నిజానికి షాక్ అయ్యానని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా పగలు – రాత్రి తేడా లేకుండా తాగడం. అది ఏ బ్రాండో అసలెందుకు తాగుతున్నాడో తెలియకుండా తాగడం, చాలా వరకు నేనే గ్రహించలేకపోయాను. మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకుంటే , నేనే ఏదో మినరల్ వాటర్ ఎమో అనుకున్నా అందులో ఎవరికీ తెలియకుండా తెచ్చుకునేది మందని నాకు తెలియనేలేదు. తెలిసిన తరువాత ఇక ఊరుకోలేదు, “ఏంటమ్మా ఇది మన ఇంటా వంటా ఉందా? ” అని ఆడపడుచుని నిలదీసాను. “లేదొదినా అప్పుడప్పుడు అంతే, ఎప్పుడూ తాగడు, ఎక్కువ టెన్షన్గా ఉన్నప్పుడు తట్టుకోలేక తాగుతాడు అంతే” అని సర్ది చెప్పేసరికి అవును కాబోసు అనుకున్నా.. ఇక అంతకన్నా ఇంకొకరికి (ఎంత నా ఆడపడుచయినా గాని) సంసారం విషయంలో జోక్యం చేసుకోడం ఇష్టంలేక.

ఈ అమ్మాయి పురిటికని రావడం వాళ్ళ అత్తగారికో అవకాశం ఇచ్చిన వాళ్ళమయ్యాము. ఆడపడుచుకి బాబు పుట్టిన తరువాత ఆవిడ వచ్చి, “పెళ్ళికి అయిన ఖర్చు ఇచ్చెస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు ” అని ఇంటిముందు నుంచుని కాబూలి వాళ్ళల్లా అడిగేసరికి మొదట మాకర్థం కాలేదు. “ఎవరు ఇస్తామన్నారు? ఎప్పుడు?” అని నేను కలగజేసుకుని అడిగేలోపే “మీ అత్తగారు మాటిచ్చారమ్మా! తప్పకుండా ఇచ్చేస్తామని ఇప్పుడు మరి రెండోవాడు కూడా పుట్టాడు కట్నం మాట ఎత్తడం లేదు” అని నింపాదిగా చెప్పేసరికి నిజం చెప్పొద్దు నాకయితే కళ్ళనీళ్ళే, ఇద్దరు పిల్లల మధ్యతరగతి సంసారం అప్పుడప్పుడే సంసారమంటే ఎంటో తెలుసుకుంటూ ఒడిదుడుకులు ఎదుర్కుంటూ వస్తున్న నాకు , మావారికి ఈ కట్నం అనేది పెద్ద ఎదురు దెబ్బే. సమాధానం ఏమి చెప్పాలా అని ఆలొచించేలోపే మావారు వాగ్ధానం “తొందరలోనే ఇచ్చేస్తాము అత్తయ్యగారు అమ్మ మాట ఇచ్చినట్లు మాకు తెలీదు” అంటూ. మళ్ళీ నాలో సమాధానాలు లేని ప్రశ్నలు, ఎలా , ఎక్కడనుండి?

అసలలా వెనకా ముందు ఆలోచించకుండా ఎలా వాగ్ధానాలు చెసేస్తారు ఈ మగవాళ్ళు? అక్కడికీ నాకింకో కోపం మన పిల్లని వాళ్ళేమన్నా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారా? మంచినీళ్ళకి బదులు మందు తీసుకునే మనిషి ఆమెకి భర్త, తలనొప్పికో, జ్వరానికో టాబ్లేట్ వేసుకుంటే “మా వాడికి వచ్చిన జీతమంతా ఆవిడ మందులకే సరిపోతుందమ్మా ” అంటూ నా దగ్గిర మెటికలు విరిచే అత్తగారు.. వీళ్ళకా చనిపోయిన మా అత్తగారు ఇచ్చేస్తాను అని మాట ఇచ్చినట్లుగా చెప్తున్న పైకం ఇవ్వడం? అపాత్రాదానం కాదా ఇది? ఏమి చెయ్యాలి ఇలాంటి వాళ్ళని? మా ఇంట్లో పుట్టాడు కదా రెండోవాడు , పసికందు ఎలా ఉన్నాడో అని చూడడానికి వెళ్తే డబ్బు తెచ్చామనుకుని, భోజనం పెట్టి, తేలేదని తెలిసి , వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టడం వల్ల మేము కూడా మీలానే అయిపోతామనే అవమానం.. వీళ్ళు మంచివాళ్ళా? కోపం , చికాకు , అసహనం, అసహాయత..

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తాగుడికి బానిసై, ఉద్యోగం పోగొట్టుకుని మనిషి రోడ్ మీద పడిపోతుంటే, ఆ అవమానాలు భరించలేక “వదినా నా వల్ల కాదు” అని మా ఇంటికొచ్చిన మనిషిని ఎటూ తోచని పరిస్థితిలో తల్లిలాగే ఆదరించాను. వీలయినంతవరకు ఇక అటు వెళ్ళొద్దని పిల్లలిని ఇక్కడే స్కూలో చేర్చాము. హఠాత్తుగా ఓరోజు “మారిపోయానక్కా ఒక్కసారి అమ్మతో మాట్లాడి నా బార్యని పంపండి నేను ఉండలేకపోతున్నాను” అంటూ వచ్చిన అతనిని చూసి ఉండబట్టలేక ఆడపడుచు అత్తగారింటికి వెళ్తే, ఆవిడన్నమాట ఇప్పటికి చెవుల్లో మారుమ్రోగుతోంది. “నువ్వేంటమ్మా ఆ వంశానికి కొమ్మవి.. నువ్వొచ్చి మాట్లాడితే నేను ఒప్పుకోను, ఇంకెవరు లేరా?” అని ఆవిడ అడిగిన తీరు.. “అవును ఎవరు లేరా?” నన్ను నేనే ప్రశ్నించుకుంటే మదిలోంచి పైకి తేలింది మా వంశ వృక్షం, రెండురోజులకల్లా ఒక 50 మందిని ఒకచోటకి చేర్చాను. కొమ్మలు కాదు, వేర్ల నుండి మొదలై చెట్టు దాకా ఎదిగిన మా బంధువులని అందరిని పిలిచాను. అందరూ వచ్చారు, వాదోపవాదాలు, ఒప్పందాల మధ్య కట్నం డబ్బులు ఆవిడకి ఇచ్చేసి మళ్ళీ అత్తరింటికి కొత్త పెళ్ళి కూతురిని పంపుతున్నట్లు ఇద్దరి పిల్లల ఆడపడుచుని సాదరంగా పంపాము. ఈ క్రమంలో కొందరు రాజకీయ ప్రముఖులని (తెలిసినవాళ్ళని) కలిసి మరీ ఒప్పందం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా సాధించానని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం.

అంత జరిగిన తరువాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తరువాత మళ్ళీ మా దగ్గిరకి, అతను ఇక రేపో.. మాపో అని డాక్టర్లు తేల్చి చెప్పేసిన తరువాత, మళ్ళీ నాకు కోపం, అసహయత, చికాకు, విసుగు కారణం “అన్నయ్యా డబ్బులు” అంటూ వచ్చిన చెల్లెలు, “ఇస్తానమ్మా ” అని మళ్ళీ వాగ్ధానంఎలా? వాళ్ళకి కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది కదా మరింకేంటి? ఎందుకు? డాక్టర్లే తేల్చి చెప్పిన తరువాత ఇంకెంత ఖర్చు పెడతారు? ఇప్పటికే లక్షలయ్యిందన్నారు మరి? లంగ్స్ పూర్తిగా పాడయిపోయాయి ఇక అది తగ్గదు అని ఒక నిర్ధారణకి వచ్చారు కదా, అతనికి ఉద్యోగం సద్యోగం ఏమి లేదు కదా.. బతికి ఉద్దరించేది ఎవరిని? మరి ఈయన చెల్లెలు అన్నిటికి తయారుగా ఉంది కదా? మరింక ఎక్కడ అప్పులు చేసి చెల్లెలా అంటూ ఇస్తారు? ఎందుకీ అపాత్రాదానం? ఎవరి ఖర్మకి ఎవరు భాధ్యులు? తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతవరకూ పాకులాడాలి? ఎందుకీ వాగ్ధానాలు?? అన్ని నిజాలు, కటువుగా ఉండే నిజాలు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న నిజం.. మరెందుకు? ఏమి చెయ్యాలి? ఎవరిని అడగాలి ? అన్ని సమాధానం లేని/రాని ప్రశ్నలే.

ఇక్కడ తప్పెవరిది? ఒక్కడే కొడుకన్న ఆ తల్లి గారాబమా? ఎలా పెంచాలో తెలియని తత్వమా? తండ్రి ఆదరణ లేకపోవడమా? రెండో బార్య కొడుకుట మరి పెంపకమేమిటో అన్నా పెళ్ళి చేసినా మావాళ్ళదా? ఇప్పుడు ఎవరిని అనగలం? ఏమని అనగలం? ఎవరిని అంటే మటుకు ఉపయోగమేముంది? అందుకే “నాకు , చికాకుగా, అసహనంగా, ఆవేశంగా ఏమి చెయ్యాలో తోచకుండా ఉంది. నన్ను ఎవరన్నా కదిలిస్తే కొట్టేస్తానేమో అన్నంత విసుగ్గా ఉంది. మనం మనకోసం కాక ఎవరికోసమో బతుకుతున్నట్లు ఎందుకీ దోబుచాట? ఎవరో ఎదో అనుకుంటారు అని ఎవరికోసమో మనమెందుకు తలవగ్గాలి మనకది తప్పు అనిపిస్తే తప్పు అంతే .. మనము చెప్పింది వింటునట్లుగా, మనం చెప్పిందానిలొ నిజాయితి ఉందని చెప్తూనే వాళ్ళు చేయాల్సింది చేసెసేవాళ్ళని చూస్తుంటే ఎంత అసహనం పెరిగిపోతుందంటే, అసలెందుకిక మనం? మన మాటకి విలువ లేనప్పుడు అనిపిస్తుంది. ఏమిటీ పరిస్థితి? దీన్నెలా అధిగమించడం? ఎన్ని ప్రశ్నలో నా మదిలో .. ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు, సమాధానాలు రాని ప్రశ్నలు.”

******

తాగడం అనేది విలాసవంతంగాను, అదొక ఫ్యాషన్ గాను  అనుకొనేవారు, తాగి కుటుంబాన్ని మర్చిపోయే వారికోసం ఆవేదనతో రాసిన జరుగుతున్న జీవితాల ఒక కల్పిత కథ.

-సాహితీ రత్న

 

(Visited 13 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: