భారత క్రికెటర్ అంబటి రాయుడికి తండ్రిగా ప్రమోషన్

Share Icons:
భారత వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడికి తండ్రిగా ప్రమోషన్ లభించింది. అతని భార్య చెన్నుపల్లి విద్య తాజాగా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఐపీఎల్ 2018 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నుపల్లి విద్యాని 2009లో రాయుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

క్రికెట్ కెరీర్ పరంగా గత ఏడాది నుంచి అంబటి రాయుడు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో 602 పరుగులు సాధించిన అంబటి రాయుడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. ఏడాది వ్యవధిలోనే భారత సెలక్టర్ల తీరు కారణంగా అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంతో మనస్థాపానికి గురైన రాయుడు ఆ టోర్నీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ.. రోజుల వ్యవధిలోనే ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని రాయుడు వెనక్కి తీసుకున్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌‌కి తనని ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో భారత సెలక్టర్లపై 3D సెటైర్లు వేసిన రాయుడు.. రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుని హైదరాబాద్ తరఫున రంజీల్లో ఆడాడు. కానీ.. అక్కడా రాజకీయాలు ఉన్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి రాయుడు ఫిర్యాదు చేశాడు. మొత్తంగా.. వివాదాల నడుమ గత ఏడాది నుంచి క్రికెట్ కెరీర్‌ని కొనసాగిస్తున్న రాయుడికి తాజాగా పాప జన్మించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.