భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్.. ఆస్ట్రేలియా క్రికెటర్‌పై పేలుతున్న సెటైర్లు

Share Icons:
భారత్‌లో టిక్‌టాక్‌ని బ్యాన్ చేయడంతో.. ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. చైనాతో సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం సోమవారం నిషేధం విధించింది. ఇందులో టిక్‌‌టాక్ యాప్ కూడా ఉంది.

కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవగా.. ఇంటి వద్దే ఉంటున్న డేవిడ్ వార్నర్.. వరుస టిక్‌టాక్ వీడియోలతో అభిమానుల్ని అలరించాడు. ముఖ్యంగా తెలుగు సూపర్ హిట్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌తో టిక్‌టాక్‌ వీడియోలని ప్రారంభించిన వార్నర్.. ఆ తర్వాత బాలీవుడ్, తమిళ సినిమాల్లోని పాటలకి కూడా చేశాడు.

టిక్‌టాక్ వీడియోల కారణంగా అతని పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా టిక్‌టాక్ వీడియో చేయాల్సిందిగా తొలుత సూచించిన వార్నర్.. ఆ తర్వాత సెటైర్లు కూడా పేల్చాడు. కానీ.. కోహ్లీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అయితే.. వార్నర్‌ని ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియా మరో ఓపెనర్ అరోన్ ఫించ్ కొన్ని టిక్‌టాక్ వీడియోలు చేశాడు.

భారత్‌లో టిక్‌టాక్ యాప్‌ని సుమారు 20 కోట్ల మంది వాడుతుంటారని ఓ అంచనా. ఈ నేపథ్యంలో.. డేవిడ్ వార్నర్ వీడియోలకి కూడా మంచి స్పందన లభించింది. కానీ.. తాజాగా భారత్‌లో ఆ యాప్‌ని నిషేధించడంతో డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు పేలుతున్నాయి. భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా వార్నర్‌ని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు.