బెల్లంకొండ గణేష్ కిరాక్ లుక్.. వెండితెరపైకి మరో వారసుడు

Share Icons:
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారు. శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బాబు హీరోగా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్‌ సాధినేని దర్శకత్వంలో గణేష్ బాబు హీరోగా సినిమా రూపొందుతోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది.

కాగా, ఈరోజు (సెప్టెంబర్ 14న) గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన లుక్స్‌ను విడుదల చేశారు. ఈ లుక్స్ చాలా బాగున్నాయి. గణేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లక్కీ మీడియా ట్వీట్ చేసింది. ‘‘యంగ్ హీరో, డైనమిక్ ప్రొడ్యూసర్ గణేష్ బెల్లంకొండకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని పేర్కొంది. తన తండ్రి సురేష్ వారసత్వాన్ని తీసుకున్న గణేష్ నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, పరిచయ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు సమాచారం. ‘మజిలీ’ సినిమాలో నాగచైతన్య కూతురిగా నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అనన్య అగర్వాల్‌ ఈ చిత్రంలో ఒక హీరోయిన్. ఆమెతో పాటు దక్ష, నటాషాలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. మరో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని బీటెల్‌ లీఫ్ ప్రొడక్షన్స్‌, లక్కీ మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.