బెంగళూరు హిట్టర్లు డివిలియర్స్, పడిక్కల్ క్లిక్.. SRH టార్గెట్ 164

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఫామ్ అందుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. ఏబీ డివిలియర్స్ (51: 30 బంతుల్లో 4×4, 2×6), దేవదూత్ పడిక్కల్ (56: 42 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీలు బాదడంతో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (14: 13 బంతుల్లో) నిరాశపరచగా.. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే (7: 8 బంతుల్లో) రనౌటయ్యారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. అరోన్ ఫించ్ (29: 27 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభించిన దేవదుత్ పడిక్కల్.. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన ఈ యువ హిట్టర్.. ఆ తర్వాత భువనేశ్వర్ బౌలింగ్‌లోనూ బౌండరీ సాధించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన పడిక్కల్.. గేర్ మార్చే ప్రయత్నంలో ఔటవగా.. అరోన్ ఫించ్ నిలకడగా ఆడినా దూకుడు పెంచలేకపోయాడు. అయినప్పటికీ.. తొలి వికెట్‌కి ఈ జోడీ 11 ఓవర్లకి 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఆ తర్వాత ఓవర్ వ్యవధిలోనే ఇద్దరూ పెవిలియన్‌కి వెళ్లిపోయారు.

పడిక్కల్, అరోన్ ఫించ్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. దాదాపు నాలుగు ఓవర్లు సింగిల్స్, డబుల్స్‌తోనే సరిపెట్టారు. ఆఖరిగా ఇన్నింగ్స్ 16వ ఓవర్‌‌లో నటరాజన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద రషీద్ ఖాన్ చేతికి కోహ్లీ చిక్కగా.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకూ డివిలియర్స్ భారీ షాట్లు ఆడలేదు. దాంతో.. బెంగళూరు 163 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్లాగ్ ఓవర్లలో శివమ్ దూబే తేలిపోయాడు.