బర్త్‌డే పోస్టర్: వెన్నెలగా శివాని.. తేజకు జంటగా రాజశేఖర్ పెద్ద కూతురు

Share Icons:
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యారు. ‘దొరసాని’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివాత్మిక.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని వెండితెర ఆరంగేట్రం చేస్తున్నారు. ఒక ఫాంటసీ లవ్ స్టోరీలో వెన్నెల అనే క్యూట్ రోల్‌ ద్వారా శివానీ రాజ‌శేఖ‌ర్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించ‌ని ఈ చిత్రంలో తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తున్నారు.

బుధవారం (జూలై 1న) శివాని పుట్టినరోజు సందర్భాన్ని పుర‌స్కరించుకొని సినిమాలో ఆమె పోషిస్తోన్న క్యారెక్టర్ ప‌రిచ‌య పోస్టర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. శివాని ఈ పోస్టర్‌లో మ‌న ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చుడీదార్ ధ‌రించి, గోడ మీద కూర్చొని ఆకాశంలోని నెల‌వంక‌ను చూపిస్తోన్న ఆమె.. అపురూప లావ‌ణ్యంతో మెరిసిపోతున్నారు. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో ఏవో వింటూ స‌రిగ్గా పాత్ర పేరు వెన్నెల‌కు త‌గ్గట్లుగా ఆమె క‌నిపిస్తున్నారు.

Also Read:

బాల‌న‌టుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించి, సూప‌ర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’లో యంగ్ యాక్టర్‌గా ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా.. ఈ న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మూడు సీజ‌న్లు ర‌న్ అయిన ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న మ‌ల్లిక్ రామ్ ద‌ర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యుఎస్‌‌కు చెందిన‌ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఎస్ ఒరిజిన‌ల్స్, మ‌హాతేజ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ తారాగ‌ణం, ఇత‌ర వివ‌రాల‌ను ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌తో త్వర‌లోనే వెల్లడించ‌నున్నారు.