ప్రధాని మోడీ ‘అమేజింగ్ పేరంట్స్’ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన విరుష్క జోడీ

Share Icons:
భారత ప్రధాని నరేంద్ర మోడీ, విరుష్క జోడీ మధ్య ఆసక్తికర ట్వీట్స్‌ సంభాషణ నడిచింది. గురువారం (సెప్టెంబరు 17) 70వ పుట్టిన రోజు జరుపుకున్న నరేంద్ర మోడీకి టీమిండియా కెప్టెన్ విషెష్ చెప్పగా.. రిప్లై ఇచ్చిన మోడీ.. కోహ్లీకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు మీ దంపతులు అద్భుతమైన తల్లిదండ్రులు అవుతారంటూ కితాబిచ్చారు. దాంతో.. ప్రధానికి విరుష్క జోడీ థ్యాంక్స్ చెప్పింది.

2017 చివర్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వచ్చే ఏడాది జనవరిలో తాము ముగ్గురం కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా విరుష్క జోడీ ప్రకటించింది. దాంతో.. క్రికెట్, సినీ ప్రముఖులు ఈ జంటకి అభినందనలు తెలపగా.. తాజాగా ప్రధాని తన వంతుగా విరుష్క జోడీని ఆశీర్వదించారు. అప్పట్లో విరుష్క జోడీ తమ వివాహ విందుకి స్వయంగా వెళ్లి మోడీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. విరాట్ కోహ్లీతో కలిసి అక్కడికి అనుష్క శర్మ వెళ్లింది. తల్లిదండ్రులు కాబోతున్న సందర్భంగా ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో కలిసి విరుష్క జోడీ పార్టీ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సెప్టెంబరు 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.