పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ధోని

Share Icons:
కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా పనులన్నీ బందు అయ్యి, దేశవ్యాప్తంగా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సహాయం చేసేందుకు భారత మాజీ కెప్టెన్ ముందుకొచ్చాడు. ముఖ్యంగా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పూణేలోని పేదలకు ఆదుకునేందుకు లక్ష రూపాయలను విరాళం ఇచ్చాడు. ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ కెట్టో ద్వారా ముకుల్‌ మాధవ్ ఫౌండేషన్ కు ఈ మొత్తాన్ని అందించాడు. ఈ విష‌యాన్ని తాజాగా ధోనీ భార్య సాక్షి సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించింది.

Read Also:
నిజానికి పూణేలోనే పేదలకు ఆదుకోవడం కోసం మాధ‌వ్‌ ఫౌండేషన్ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధోని లక్ష రూపాయలు విరాళం ఇవ్వగానే మిగతా వారు స్పందించారు. దీంతో ఫౌండేషన్ అనుకున్న లక్ష్యాన్ని చాలా వేగంగా చేరుకుంది. ఇప్పటికే పూణేలోని నిరుపేద ప్రజలను గుర్తించిన ఫౌండేషన్.. వారికి సాయం చేయడానికి నడుం కట్టింది. నిత్యవసర వస్తువులైన సబ్బులు, బియ్యం, గోధుమపిండి, నూనె త‌దిత‌ర వ‌స్తువుల‌ను ఒక ప్యాకెట్లో ఉంచి పేద కుటుంబాలకు అందించనుంది.

Read Also:
ఇక దేశవ్యాప్తంగా నిరుపేదలను ఆదుకోవడం కోసం అనేక మంది క్రికెటర్లు, సెలబ్రిటీలు ముందుకు వస్తున్న‌ సంగతి తెలిసిందే. ప్రముఖ క్రికెటర్లు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ ప‌ఠాన్ సోద‌రులు పేద ప్రజల కోసం సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ యాభై లక్షల రూపాయల బియ్యాన్ని పేదలకు పంచేందుకు ముందుకొచ్చాడు. ఇక భార‌త‌ బ్యాడ్మింటన్ టాప్‌ ప్లేయర్ పీవీ సింధు పది లక్షల మొత్తాన్ని తెలుగు ప్రభుత్వాలకు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.