పుజారాపై విమర్శలొద్దు.. వైస్ కెప్టెన్ సపోర్ట్

Share Icons:
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారాకి వైస్ కెప్టెన్ మద్దతుగా నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో నెమ్మది ఇన్నింగ్స్ ఆడిన పుజారాపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 42 బంతులాడిన పుజారా 11 పరుగుల వద్దే వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 81 బంతులాడిన పుజారా మళ్లీ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్‌రేట్ 13.58గా నమోదవడం గమనార్హం.

Read More:

పుజారా నెమ్మదిగా ఆడటంపై విమర్శలు వస్తుండటంతో అజింక్య రహానె స్పందించాడు. ‘తొలి టెస్టుల్లో న్యూజిలాండ్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నాకు తెలిసీ.. మ్యాచ్‌లో పుజారా పరుగులు చేయలేకుండా ఏమీ కనిపించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను రన్స్ రాబట్టాలనే చూశాడు. కానీ.. కివీస్ బౌలర్లు లయ తప్పకుండా బంతులు వేస్తూ వచ్చారు. అందుకే పుజారా రన్స్ చేయలేకపోయాడు. అయినా.. ప్రతి బ్యాట్స్‌మెన్‌‌ ఇలాంటి కష్టాల్ని ఏదో ఒక దశలో ఎదుర్కోక తప్పదు. కాకపోతే.. అందరి ఆటా ఒకేలా ఉండదు. ఎవరి స్టైల్ వారిదే. రెండో టెస్టులో పరుగులు రాబట్టడంపై ఓ జట్టుగా మేము చర్చించుకుని బరిలోకి దిగుతాం’ అని రహానె వెల్లడించాడు.

Read More:

బంతి పాతబడే వరకూ ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చే చతేశ్వర్ పుజారా.. ఆ తర్వాత గేర్ మార్చేవాడు. కానీ.. తొలి టెస్టులో మాత్రం భిన్నమైన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా.. షాట్ ఆడేందుకు అవకాశం ఉన్న బంతుల్ని కూడా వదిలేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ విసిరిన బంతిని వదిలేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ క్రైస్ట్ చర్చ్ వేదికగా శనివారం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభంకానుంది.