పాలిటిక్స్‌తో పవన్ బిజీ.. అందుకే మామిడి పండ్లు పంపలేదు: ఆలీ

Share Icons:
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన స్నేహితుడు, జనసేన అధినేత పవర్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆదివారం ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన ఆలీ.. పవన్ కళ్యాణ్‌తో తన పరిచయం గురించి, ఆయనతో ఏర్పడిన బంధం గురించి చెప్పుకొచ్చారు. తాను చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేవారని.. ఆయనతో అలా పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదని అన్నారు.

‘‘నేను అన్నయ్య కోసం వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేవారు. ఆయన్ను కలిసేవాడిని. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోకి ఎంటర్ కాలేదు. ‘అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. మీరు కూర్చోండి.. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. అన్నీ సినిమా కబుర్లే. ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగేవారు. ఆ తరవాత ఆయన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ ఒక్క సినిమా తప్ప ఆ తరవాత ఇంచుమించుగా అన్ని సినిమాల్లో నేను నటించాను.

Also Read:

ఇటీవల ‘అజ్ఞాతవాసి’లో కూడా నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. మొదట ‘గోకులంలో సీత’, తరవాత ‘సుస్వాగతం’, తరవాత ‘తొలిప్రేమ’ సినిమాలో నటించాను. ‘తొలిప్రేమ’ సినిమా నుంచి మా జర్నీ బలపడింది. పవన్ కళ్యాణ్ గారితో ఆఖరిగా చేసిన సినిమా కాటమరాయుడు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.

బయట కార్యక్రమాల్లో ఆలీ ఎదురుగా కనబడినా, ఆయన మాట్లాడినా పవన్ కళ్యాణ్ నవ్వడం మొదలుపెడతారు. దీని గురించి ఆలీ మాట్లాడారు. ‘‘మేం కొన్ని సైగలు చేసుకుంటూ ఉంటాం. అవి మా ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలీవు. నావి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే, బ్రహ్మానందం గారన్నా ఆయనకు చాలా ఇష్టం. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందం గారు చాలా దగ్గర. మెగా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆహ్వానించే కొంత మంది పేర్లలో బ్రహ్మానందం గారి పేరు, నా పేరు కచ్చితంగా ఉంటాయి’’ అని ఆలీ వెల్లడించారు.

Also Read:

ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి నుంచి తనకు ఆవకాయ పచ్చడి వస్తుందని ఆలీ తెలిపారు. పెద్ద జాడీతో ఆవకాయ పచ్చడి పంపుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా సేంద్రియ మామిడి పండ్లు పంపేవారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మామిడి పండ్లు రాలేదని.. బహుశా వచ్చే ఏడాది రావచ్చేమోనని ఆలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వైఎస్సార్‌సీపీలో చేరిన తరవాత తన రాజకీయాల గురించి ఆలీ మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల నుంచి మా ఇంట్లో పాలిటిక్స్‌తో సరిపోతోంది. పిల్లలకి నాకు.. నాకు, మా ఆవిడకి రాజకీయాలు జరుగుతున్నాయి. కోవిడ్ అయిన తరవాత వెళ్లి కలుస్తా’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.