పవన్, రవితేజ మల్టీస్టారర్.. రీమేక్ స్పెషలిస్ట్‌తో ప్రయోగం!

Share Icons:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి దూకుడు మీద ఉన్నారు. వరుసపెట్టి ప్రాజెక్టులను ఓకే చేస్తున్నారు. ఇప్పటికే, ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంచుమించుగా పూర్తయింది. ఈ చిత్రంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో కూడా పవన్ పాల్గొంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ వరుస సినిమాలతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు పవర్ స్టార్.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టు ఇండస్ట్రీ టాక్. డైరెక్టర్ డాలీ (కిషోర్ కుమార్ పార్ధసాని) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇది మల్టీస్టారర్ అట. మాస్ మహారాజా రవితేజతో కలిసి పవన్ ఈ సినిమా చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న ఒక వదంతు మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ, ప్రస్తుతం డాలీ ఒక తమిళ రీమేక్ సబ్జెక్ట్ మీద పనిచేస్తున్నారని మాత్రం తెలుస్తోంది.

Also Read:

డాలీ రీమేక్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డాలీ.. ఆ తరవాత ‘తడాఖా’, ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ రీమేక్ సినిమాలు చేశారు. వీటిలో ‘గోపాల గోపాల’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే పవన్‌తో రెండు సార్లు పనిచేసిన డాలీ.. ఆయన కోసం మరో రీమేక్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాలో మరో హీరోకు కూడా ఛాన్స్ ఉండటంతో రవితేజను తీసుకోవాలని నిర్ణయించారట. పవన్, రవితేజలను డాలీ సంప్రదించగా వారు కూడా పచ్చజెండా ఊపారని ఇండస్ట్రీ టాక్. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఈ వార్తలో నిజమెంతో చెప్పలేం.

కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ కోసం చూస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. నివేతా థామస్, అనన్య నాగళ్ల, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు, రవితేజ ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు.