నేటి పాఠశాలల వైఖరిపై ఓ తల్లి వ్యధ

నేటి పాఠశాలల వైఖరిపై  ఓ తల్లి వ్యధ
Views:
36

కార్తీకమాసం ఏకాదశో మరి పౌర్ణమో తెలీదు కాని మా చుట్టాలెవరో సత్యనారయణవ్రతం చేసుకొంటున్నారంటే ప్రసాదానికని అమ్మ నన్ను పంపింది. అందరూ శ్రద్ధగా కథ వింటున్నారు. ఐదో కథ అయిపోయింది, వెంకటేశ్వర దీపారధన చేసి, మంగళహారతి పాడేసి ఇక ఉద్యాపన చెప్పడమే.. “మంగళహారతి ఎవరో ఒకరు పాడాలి ” అని అన్నారు పంతులుగారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొన్నారు, అందరికంటే చిన్నగా నేనే కనిపించాను .. “నువ్వు పాడవే ” అంటూ అందరూ నన్నడిగారు నేను అప్పుడు 6 వ తరగతి చదువుతున్నా.. మా స్కూల్ ప్రభావమో ఏమో ..అసెంబ్లిలో నించుని ఎంతో దీక్షగా నలుగురితో పాడేదాన్ని కాబట్టి, జంకు బొంకు లేకుండా పాట అందుకొన్నా. పాట మొదలెట్టగానే అక్కడున్నవారు “ఆపేయ్ !!.” మేమే పాడుకొంటామని గట్టిగా అరిచేసరికి.. భయంతో ఒక్కసారిగా వణికిపోయను. ప్రసాదం తీసుకొని… బయటకి వచ్చేప్పుడు కళ్ళనీళ్ళతో అడిగేశాను వాళ్ళని “ఎందుకు ఆపమన్నారు నేను బాగా పాడలేదా?” అని.. ఆవిడ నామీద గట్టిగా అరిచేసింది. “ఇక్కడ జరుగుతున్న పూజ ఏంటి, నువ్వు పాడిన పాట ఏంటి? తప్పు కదా ” అని.. నిజానికి ఆ పాట పాడకూడదని నాకసలు తెలీదు అప్పట్లో ఇప్పటిలాగ 6 వ తరగతికే జ్ఞానాలు వచ్చేవి కాదు, టీచర్ ఇలా చెయ్యమంది అంతే. అదొక్కటే మనసులో ఉండేది. ఎక్కడ ప్రార్థన జరిగినా ఈ పాట పాడాలి అని చెప్పిన తెలుగు టీచర్ మాట అది. తరువాత అమ్మ కి చెప్తే .. అమ్మ కూడా చెడా మడా దులిపేసింది. ఇంతకీ నేను పాడిన పాట నడిపించు నా నావా నడి సంద్రమున దేవా.. అల్లేలూయా … అల్లెలూయా (అంతగా గుర్తులేదు) అంటూ పాడేను.

ఎప్పుడో చిన్నప్పుడు 6 తరగతిలో జరిగిన ఈ సంఘటన , ఎవరు సత్యనారయణవ్రతం చేసుకొన్నా… మదిలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాయడానికి కారణం .. మైదకూరులో పిల్లల మెళ్ళో వెళ్ళాడతీసిన బోర్డ్… తెలుగుని అపహాస్యం చేసిన వైనం. ప్రతిఒక్క తెలుగు భాషాభిమాని బాధపడేంతగా జరిగిన ఆ సంఘటన. ఇది తల్లి తండ్రుల తప్పా? ఉపాధ్యాయుల తప్పా? అని చర్చినుకొంటున్నారు అందరూ.

క్లాస్ రూముల్లో “మనది మనవతావాదం, మనది మానవకులం వెరే ఏ కులాలు లేవు, మతాలు లేవు అంటూ భోదించి తరగతి గడపదాటాగానే పిల్లలిని తెలియకుండా మతం అనే ఊబిలోకి లాగుతున్నారు. అంటే స్లో పాయిజన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మిషనరీ స్కూల్స్‌లో జరిగేవి ఇవే. మాజి దివంగత ముఖ్యమంత్రిగారు తనలా చాలా మంది మంత్రులని ఇంకో మతంలోకి మారేలా చేసారని ఎక్కడో చదివాను. ఈ మతాభిమానుల ప్రధమ కర్తవ్యం అదేనేమో అని అనిపిస్తుంది.

మిగతా స్కూల్లో ఎలా ఉందో నాకు తెలీదు కాని, మొన్నామధ్య మా పాప పుట్టినరోజుకి వాళ్ళ మావయ్య చక్కటి రోజా పువ్వుల బోకే పంపితే “అమ్మా రోజుకో పువ్వు తల్లో పెట్టుకొని వెళ్తానని ” సంబరపడి దాచుకొని మొదటి రోజు పెట్టుకొని వెళ్ళింది మా పాప. అంతే 5 రూపాయలు పరిహారం పూలు పెట్టుకొన్నందుకు.. పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, బొట్టు అసలు కనిపిస్తోందా లేదా అన్నట్లు పెట్టుకోవాలి.అసలు పెట్టుకోపోతే మరీ మంచిది కాళ్ళకి పట్టీలు పెట్టుకోకూడదు. ఆఖరికి చెవులకి కూడా ఏమి వద్దంటారు, అందరు విధ్యార్థులు ఒక్కటే ఒకలానే ఉండాలి , ఐకమత్యం అని ఇలా యునిఫార్మ్ పెట్టడం మంచిదే .. కాని, వాళ్ళ అభిరుచుల్ని చంపేయడమెందుకు? ఎప్పుడో ఖర్మకాలితే ఇవన్నీ తీసేయ్యాలని అనేవారు పెద్దవారు. అదిప్పటినుండి అలవాటు చేస్తున్నామేమో అనిపిస్తుంది.

పాఠ్యాంశాలలో మత ప్రస్తావన లేకపోయినా, ఇలా పాటల ద్వారా, వారి యునిఫార్మ్ రూపేణా వారిలో ఒక భావాన్ని జొప్పించేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన సౌందర్యాభిలాషణని ఇలా మొగ్గలోనో తుంచేయ్యడమేమొ అనిపిస్తుంది. నేనే ఊరుకోలేక ఒకసారి ఈ విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ” వాళ్ళకి వేరేవాటిమీద దృష్టి మళ్ళకుండా ఒక్క చదువుపై మాత్రమే ఆసక్తి కలిగేలా చేయడానికి ఇలా…” అని సమాధానం ఇచ్చారు ఆ ప్రిన్సిపల్. ఈ ఆలోచన మరి వాళ్ళకి చదువులు చెప్పే ఉపాధ్యాయులమీద లేదా? స్లీవ్లెస్స్ బ్లౌజులు, కట్టామా లేదా అన్నట్లు కట్టే చీరలు, ఇవన్ని చెప్తే?? మనమా…. పిల్లలికి ఎల్లవేళల్లో అందుబాటులో ఉండము గబుక్కున నామీద కోపం వస్తే …. పిల్లలే బలి అవుతారని నోటిమీద వేలేసుకోడం…. ఇదే మన సంస్కృతి. .

పోని స్కూల్ మార్చేద్దాము అనవసరంగా పిల్లలు దృష్టి చదువునుండి మరల్తోంది అంటే దగ్గర్లో అంతకంటే చెప్పదగ్గ స్కూల్స్ లేవు. ఉన్నా ఈ కోవలోకి చెందినవే, పొయ్యి మీంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది. స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళిష్టం ఇంట్లో మనమే పిల్లలికి నెమ్మదిగా నేర్పుకోవాలి. అలాగే తెలుగు భాషా విషయంలో కూడా తల్లి తండ్రులకే సరైన అవగాహన ఉండాలి. స్కూల్లో ఏమి చెప్తే అది అంతే, మీరలానే ఉండాలి అని వాళ్ళని ఆధారపడేలా కాక, వాళ్ళంత వాళ్ళు ఆలోచించుకొనే అవకాశం ఇవ్వగలిగేది, వాళ్ళకి మార్గదర్శకులయ్యేది తల్లితండ్రులే నా ఉద్దెశ్యంలో. ఇలా భాష విషయంలో , మతం విషయంలో స్లో పాయిజన్ ఇస్తుంటే ప్రత్యామ్నాయాలు తల్లితండ్రుల దగ్గిరే ఉంటాయి. కాబట్టి మన పిల్లలిని మనమే మార్చుకొందాము…మనము మారిపోకుండా…

“మనము మారిపోకుండా…..” అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మావాళ్ళకి తెలిసినవాళ్ళ అమ్మాయి ఈ భోదనలకో, పాటలకో ఆచరించే విధానాలకో, అకస్మాత్తుగా ఎదో డబ్బు వచ్చేస్తుందనే ఆశతోటో తెలీదు కాని వెరే మతంలోకి వెళ్ళి పెద్దవాళ్ళతో వాదించి,, ” మీకు ప్రాణమున్న నేను కావాలా? నేను అలంకారానికి పెట్టుకొనే ప్రాణంలేని బొట్టు కావాలా” అని నిలదీసిందిట, “బొట్టుతో కళ కళ లాడే నువ్వు కావాలి” అని అనడంపోయి తల్లితండ్రులు కూడా మారిపోయారట . . కాబట్టి పుట్టినప్పటినుండి మనకి మతమంటే ఎంటో తెలియనప్పటినుండి చక్కటి అలంకరణ చేసుకొనే మనం ఎవరో ఏదో చెప్తున్నారని గుడ్డిగా ఆచరించడం ఎంతవరకూ సమంజసం? మరి వీటికి కారణభూతులయ్యేవారిని మనమేమి చేద్దాం? అసలేమి చేయగలము?

(Visited 16 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: