‘‘నిత్యానందతో రంజితను అలా చూసి గుండెపగిలిపోయింది’’

Share Icons:
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రంజిత. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. కొంతకాలం వరకు బాగానే సినిమాలు చేసిన ఒక్కసారిగా నిత్యానంద వలలో చిక్కుకుపోయింది. ఆ తర్వాత కొన్ని వీడియోలు బయటికి రావడం, పోలీసు కేసులు అంటూ రచ్చ రచ్చ అయ్యింది. ఈ విషయంపై పరుచూరి మాట్లాడుతూ చాలా బాధపడ్డారు.

‘‘నేను తిలకం దిద్దిన నటి రంజిత. ఇటీవల ఆమె ఎక్కడో తలదాచుకుంటోందని తెలిసింది. నా మూడో కూతురికి రంజిత స్నేహితురాలు. ఓసారి మా ఇంటికి వచ్చింది. నేను పిలిస్తే వెనక్కు తిరిగి కళ్లు ఎగరేసింది. వాళ్ల నాన్న కూడా నటుడే. అప్పుడు నేను నటుడు చలపతిని పిలిచి ఆ పాపకు నటించడం ఇష్టమేమో కనుక్కో అని అడిగాను. ఎందుకు సర్ చాలా పద్ధతిగా బతుకుతున్న కుటుంబం, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో మనకు తెలీదా అన్నారు. అది విని నేను సలహా మాత్రమే ఇస్తున్నాను అని చెప్పాను. అదే సమయంలో చలపతి ‘కడప రెడ్డమ్మ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు’’

READ ALSO:

‘‘ఆ సినిమాలో రంజితను తీసుకోమని చెప్పాను. మూడు రోజుల తర్వాత సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఓసారి నాకు రంజిత కుటుంబం రైల్వే స్టేషన్ వద్ద ఎదురుపడింది. అప్పుడు రంజిత చిన్న పిల్లలాగా నా దగ్గరికి వచ్చి ‘థ్యాంక్స్ అంకుల్’ అని హత్తుకుంది. కానీ దురదృష్టవశాత్తు ‘కడప రెడ్డమ్మ’ సినిమా ఆడలేదు. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో రంజిత నటించింది. అద్భుతమైన వేషాలు వేసి మంచి స్థాయికి వెళ్లింది. నన్ను ఎప్పుడూ ఓ తండ్రిలా చూసేది. 1995లో నేను ఓ డ్రామా కోసం అమెరికా వెళ్లా్ల్సి వచ్చింది. నాకు తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలని అనుకున్నా. అప్పటికే రంజితకు వీసా వచ్చింది’’

See Photo Story:

‘‘అలా రంజితను అమెరికా తీసుకెళ్లాను. మాతో పాటు ఇంకా ఎంతో మంది ఆర్టిస్ట్‌లు వచ్చారు. సినిమాలు బాగా చేస్తుంది అనుకున్న అమ్మాయి అమెరికాలో వేసిన డ్రామాలోనూ అద్భుతంగా నటించింది. కొన్ని రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి ‘నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను’ అంది. ఎందుకమ్మా సినిమాలు చేసుకోక అన్నాను. కానీ తనకు డైరెక్షన్ అంటే ఇష్టం అంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు నా దగ్గరికి వచ్చింది. నా చేతిలో ఓ పుస్తకం పెట్టింది. అది నిత్యానందకు సంబంధించిన బుక్. ఆయన చాలా గొప్పవారు అంకుల్ ఈ పుస్తకం చదవండి అంది. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా అని చెప్పాను’’

READ ALSO:

‘‘ ఆ రోజు నువ్వు కూడా అతని భజలకు వెళ్లకమ్మా అని చెప్పి ఉంటే బాగుండేదేమో. కానీ ఎప్పుడైతే నిత్యానంద, రంజితలకు సంబంధించిన వీడియోలు చూశానో ఓ తండ్రి ఎంత బాధపడతాడో అంతకంటే ఎక్కువగా నా గుండె బాధపడింది. బంగారు మనసున్న అమ్మాయి అలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయింది. నేను మంచి నటి అవుతుంది అనుకున్నా. కానీ తను వేరే మార్గం ఎంచుకుంది. ఏదేమైనా రంజిత ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని వెల్లడించారు.