నా కెరీర్లో అదే చెత్త దశ: రోహిత్ శర్మ

Share Icons:
భారత వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ తన కెరీర్ గురించి తాజాగా సోషల్ మీడియాలో పలు విషయాలను పంచుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తనను ఇంటర్వ్యూ చేసి, పలు విషయాలపై ప్రశ్నించాడు. దానికి త‌న‌దైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఇందులో భాగంగా తన కెరీర్లో అతి చెత్త దశ అని అడుగగా దానికి రోహిత్‌.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. 2011 వన్డే వరల్డ్ కప్పున‌కు ఎంపిక కాకపోవడం, తన కెరీర్లో అతి చెత్త దశ అని వ్యాఖ్యానించాడు. భారత్‌ లోనే జరిగిన ఆ వరల్డ్ కప్‌ను భార‌త్ గెలుపొందింది. దీంతో 28 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్ష‌ణ తర్వాత ఇండియా మెగా టోర్నీని గెలిచింది.

Read Also:
2011 వరల్డ్ కప్‌న‌కు ముందు తన ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండేదని, ఈ నేపథ్యంలో మెగాటోర్నీకి తనను ఎంపిక చేయ‌లేదని రోహిత్‌ తెలిపాడు. ఆ నిర్ణయం చాలా బాధాకరమైన విషయం అని పేర్కొన్నాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్.. తన సొంతగడ్డ ముంబైలోనే జరిగిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇక ఆ టోర్నీ తర్వాత రోహిత్ కెరీర్ వేగంగా ఎదిగింది. 2015, 2019 వ‌న్డే ప్రపంచ కప్‌లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక గతేడాది జరిగిన టోర్నీలో అయితే 5 శతకాలతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. మరోవైపు వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా సచిన్‌తో కలిసి పంచుకున్నాడు.

Read Also:
మ‌రోవైపు ఐపీఎల్లో భాగంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గడిపిన క్షణాలను మరిచిపోలేనని రోహిత్‌ తెలిపాడు. 2013లోనే పాంటింగ్‌ నుంచి ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ.. నాలుగుసార్లు ఆ జ‌ట్టును చాంపియ‌న్‌గా నిలిపాడు. దీంతో ఐపీఎల్ టైటిల్‌ను అత్యధిక సార్లు నెగ్గిన‌ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. క‌రోనా వైరస్ కారణంగా ప్రస్తుతం క్రికెట్ కార్యకలాపాలన్నీ ర‌ద్దు కావడంతో రోహిత్ శర్మ ఇంటికే పరిమితమయ్యాడు.