నారా లోకేష్ హీరోగా.. సంచలన దర్శకుడి సినిమా.. ఇప్పుడు ఎందుకీ రచ్చ..!?

Share Icons:
సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాడులో ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. చిరంజీవి ఆ ప్రయత్నం చేసినా కుదర్లేదు. రాజకీయ నాయకుల వారసులకు సినిమా పట్ల ఆసక్తి ఉండటం అనేది కూడా మనం చూస్తున్నదే. మహారాష్ట్ర మాజీ సీఎం, దివంగత నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు రితేష్ దేశ్‌ముఖ్.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఇలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌ను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది. అది ఇప్పటి సంగతి కాదుగానీ.. బాబు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయట. 2001లో నిన్ను చూడాలని చిత్రంతో తారక్ సినిమాల్లో అడుగుపెట్టాడు. అది జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత లోకే‌ష్‌ను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నారట.

‘జయం’ చిత్రంతో సూపర్ హిట్ అందుకొని అద్భుత ఫామ్‌లో ఉన్న తేజ దర్శకత్వంలో.. లోకేష్ హీరోగా సినిమా ప్లాన్ చేశారని.. అది పట్టాలు ఎక్కలేదని తెలుస్తోంది. 2002లో ‘సంతోషం’ సినీ వార పత్రికను ప్రారంభించారు. ఆ ఏడాది ఆగస్టులో విడుదలైన తొలి సంచికలో చిరంజీవి ఫొటోతో కూడిన కవర్ పేజీతో తొలి సంచిక విడుదలైంది. అదే కవర్ పేజీ మీద ‘ముఖ్యమంత్రి తనయుడు హీరోగా ‘తేజ’ చిత్రం..?’ అనే శీర్షిక, లోకేష్, తేజ ఫోటోలను ప్రచురించారు. ఈ కవర్ పేజీని సురేష్ కొండేటి ఇటీవల ట్వీట్ చేశారు.

అప్పటి నుంచి ఈ ఫొటో, వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లోకి వస్తే ఎలా ఉండేదో తెలీదుగానీ.. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం ఈ కవర్ పేజీని షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నాయి.