నయనతార vs సమంత.. మధ్యలో ఇరుక్కుపోయిన విజయ్ సేతుపతి

Share Icons:
వాలంటైన్స్ డే రోజున సమంత తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తన కొత్త సినిమాను ప్రకటించారు. అయితే, అది తెలుగు సినిమా కాదు తమిళ చిత్రం. కాకపోతే, ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. అంతేకాదు.. నయనతార, సమంత కలిసి నటిస్తుండటం కూడా ఇదే ఫస్ట్ టైమ్. అయితే.. నయనతార, విజయ్ సేతుపతి కలిసి గతంలో నటించారు. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా అంచనాలు ఏర్పడతాయి. ఇంతకీ సినిమా టైటిల్ చెప్పలేదు కదూ.. ‘‘కాతు వాకుల రెండు కాదల్’’. మరి ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తారో లేదో చూడాలి.

తన కొత్త సినిమా వివరాలను సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒక చిన్న వీడియోను కూడా షేర్ చేశారు. 37 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఈ సినిమాను విగ్నేష్ శివన్ మూడేళ్ల క్రితమే ప్రకటించారు. అప్పుడు.. విజయ్ సేతుపతి, నయనతార, త్రిషలను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు. కారణాలేంటో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి త్రిష స్థానంలో సమంతను తీసుకొని ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. త్వరలోనే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ షూటింగ్ ప్రారంభంకానుంది.