ధోనీ అంచనాలు తలకిందులు.. ఢిల్లీ చేతిలో చెన్నై ఓటమికి కారణాలివే!

Share Icons:
షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ విజయం కోసం పోరాడిన ధోనీ సేన ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐపీఎల్ 2020లో ఆరో ఓటమికి మూటగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో.. చెన్నై బాగానే బ్యాటింగ్ చేసినా.. బౌలర్లు ఆకట్టుకున్నా.. ఫీల్డింగ్ తప్పిదాలతో ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఆఖరి ఓవర్లలో రాయుడు (25 బంతుల్లో 45), జడేజా (13 బంతుల్లో 33) చెలరేగడంతో.. చెన్నై 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది.

కానీ ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయ శతకంతో ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. టీ20ల్లో తొలి సెంచరీ చేసిన ధావన్.. జట్టును గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో.. ప్లేఆఫ్స్ చేరాలంటే.. చెన్నై మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. మంచు ప్రభావం, ధోనీ అంచనాలు తప్పడంతో ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన చేసిన తప్పిదాలేంటో చూద్దాం..

అదనపు బ్యాట్స్‌మె‌న్..
అబుదాబీ, దుబాయ్ మైదానాలతో పోలిస్తే.. షార్జా గ్రౌండ్ చిన్నది. బ్యాట్స్‌మెన్ తేలిగ్గా సిక్సులు, ఫోర్లు బాదగలరు. దీంతో జట్లు అదనపు బౌలర్‌ జట్టులో ఉండేలా చూసుకుంటాయి. కానీ చెన్నై మాత్రం కేదార్ జాదవ్ రూపంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు దిగే అవకాశమే రాలేదు. కానీ చెన్నై జట్టులో మాత్రం అదనపు బౌలర్ లేని లోటు కనిపించింది. జాదవ్ బదులు పేస్ బౌలర్‌ను జట్టులోకి తీసుకొని ఉంటే డెత్ ఓవర్లలో ప్రయోజనకరంగా ఉండేది.

స్లో బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరంభంలోనే సామ్ కరన్ వికెట్ కోల్పోయింది. తర్వాత డుప్లెసిస్, వాట్సన్ జోడి నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. దీంతో 9 ఓవర్లలో చెన్నై 56 రన్స్ మాత్రమే చేసింది. షార్జాలాంటి వేదికపై ఓవర్‌కు ఆరు పరుగులే చేయడమంటే చాలా తక్కువ రన్ రేట్ కిందే లెక్క. ఆఖర్లో జడేజా, రాయుడు మెరుపులు మెరిపించడంతో చెన్నై 179 రన్స్ చేయగలిగింది. తాము అదనంగా మరో 10 పరుగులు చేసి ఉండుంటే బాగుండేదని మ్యాచ్ అనంతరం ధోనీ అభిప్రాయపడ్డాడు.

ఫీల్డింగ్ తప్పిదాలు..
180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత ధావన్, శ్రేయాస్ అయ్యర్ కుదురుకోవడంతో.. పరిస్థితి మారింది. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా.. మూడుసార్లు ధావన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చేతిలో పడిన క్యాచ్‌లు, దగ్గర్నుంచి వెళ్తున్న క్యాచ్‌లను సైతం చెన్నై ఫీల్డర్లు వదిలేశారు. దీంతో ధావన్ అజేయ శతకంతో ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. చెన్నై ఫీల్డర్లు క్యాచ్‌లను సరిగా అందుకొని ఉండుంటే.. మ్యాచ్ కచ్చితంగా మలుపు తిరిగేది.

ఆఖరి ఓవర్ బ్రావో కోసం ధోనీ అట్టిపెట్టాడు.
దీంతో ఢిల్లీ విజయానికి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమైన దశలో జడేజా చేతికి ధోనీ బంతిని అప్పగించాడు.