దేశంలో 3,600 దాటిన కరోనా కేసులు.. 99 మంది మృతి

Share Icons:
దేశంలో మరింత ఉద్ధృతమవుతోంది. గత ఐదు రోజుల నుంచి కోవిడ్-19 కేసులు సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. దేశంలో నమోదయిన కరోనా కేసుల్లో 30 శాతం నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొనవే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా కరోనా వైరస్ రెండో దశ దాటి సామూహిక వ్యాప్తి దిశగా సాగుతోంది. గడచిన 24 గంటల్లో 600కిపైగా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,600 దాటగా, మొత్తం 99 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 140కిపైగా కేసులు నమోదయ్యాయి.

మర్కజ్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు కొనసాగాయి. దక్షిణాదిలోని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్‌తోనే సంబంధం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం ఏపీలో 30 కేసులు నిర్ధారణ అయితే, తెలంగాణలో 43 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 272, ఏపీలో 194కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 11 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 194కు చేరింది. శనివారం ఉదయానికి 164 నమోదు కాగా.. రాత్రికి మరో 30 కేసులు పెరిగినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే అధికంగా ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలో శనివారం మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతిచెందినట్టు సమాచారం.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 272కు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం 75 కేసులు నమోదు కాగా.. శనివారం 43 మందికి పాజిటివ్ అని తేలింది. కోవిడ్ బారిన పడి రాష్ట్రంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది చికిత్స అనంతరం హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 228 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో 250 కేసులు ఉండగా.. ఎక్కువ మందికి పరీక్షలు చేస్తుండటంతో సాయంత్రానికి ఈ సంఖ్య పెరిగింది. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని మంత్రి ఈటల తెలిపారు. తెలంగాణలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని మంత్రి తెలిపారు.

ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 99 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 32 మంది, తెలంగాణ 11, మధ్యప్రదేశ్ 11, గుజరాత్ 10, ఢిల్లీ 6, పశ్చిమ్ బెంగాల్ 6, పంజాబ్ 5, ఢిల్లీ 4, కర్ణాటక 4, తమిళనాడు 3, జమ్మూ అండ్ కశ్మీర్ 2, ఉత్తర ప్రదేశ్ 2, కేరళలో 2, హిమాచల్ ప్రదేశ్‌ 2, ఏపీ, బీహార్, , ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 288 మంది బాధితులు కోలుకున్నారు.

మహారాష్ట్రలో 635, తమిళనాడులో 485, ఢిల్లీలో 445, కేరళలో 306, తెలంగాణ 2729, ఉత్తరప్రదేశ్‌లో 234, రాజస్థాన్ 2009, ఆంధ్రప్రదేశ్ 194, మధ్యప్రదేశ్ 179, కర్ణాటకలో 144, గుజరాత్ 108, జమ్మూ కశ్మీర్ 92, హర్యానా 84, పశ్చిమ్ బెంగాల్ 65, పంజాబ్ 65, బీహార్ 32, ఒడిశా 20, చండీగఢ్ 18, అసోం 26, లడఖ్ 14, అండమాన్ నికోబార్ దీవులు 10, ఉత్తరాఖండ్ 16, చత్తీస్‌గఢ్ 9, హిమాచల్‌ప్రదేశ్ 6, గోవా 6, పుదుచ్చేరి 5 కేసులు నమోదయ్యాయి.