దానికి ఆయన ఫీలయ్యారు.. చనువుగా మందలించారు: బాలు గురించి చిరు భావోద్వేగ వీడియో

Share Icons:
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తనకు అన్నయ్యలా ఉండేవారని.. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం మృతి వార్త తెలియగానే చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాలు మరణవార్త విని గుండె బద్దలైందని పేర్కొన్నారు. ఆయన మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, బాలుని మరోసారి గుర్తుచేసుకుంటూ శుక్రవారం సాయంత్రం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘‘బాలసుబ్రహ్మణ్యం ఇక మన మధ్య లేరన్న చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన హాస్పిటల్‌లో చేరిన దగ్గర నుంచీ అందరిలానే కోలుకుని మన మధ్యకి వచ్చేస్తారు, ఆయన వైభవం మళ్లీ చూస్తాను అని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాకు ఈరోజు ఆయన లేరు.. శాశ్వతంగా దూరమయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. గుండె తరక్కుపోతోంది.. చాలా బాధగా అనిపిస్తోంది. నా సొంత అన్నయ్యను కోల్పోయినంత బాధగా అనిపిస్తోంది’’ అని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.

Also Read:

తన విజయం వెనకాల బాలసుబ్రహ్మణ్యం ఉన్నారని తాను నమ్ముతానని చిరంజీవి అన్నారు. ‘‘నా సక్సెస్‌కు ప్రధానమైన కారణం సాంగ్స్. ఆ పాటలు అంత బాగా రావడానికి కారణం బాలు గారే అని నేను నమ్ముతాను. నా విజయం వెనుక, అభివృద్ధి వెనుక, ప్రజాదరణ వెనుక ఆయన ప్రోత్సాహం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎప్పటికీ ఆయనకు రుణపడే ఉంటాను. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ నాకు ఇచ్చి నా కెరీర్ పరంగా నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన అన్నయ్య బాలు గారిని నేను జీవితాంతం మరిచిపోలేను. ఎప్పటికీ ఆయనకు రుణపడే ఉంటాను’’ అని చిరంజీవి అన్నారు.

తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అంటే సుమారు 40 ఏళ్ల క్రితం బాలుని ఎంతో చనువుగా ‘‘అన్నయ్య.. నువ్వు..’’ అనేవాడినని చిరంజీవి చెప్పారు. అయితే, ఆ తరవాత బాలు గొప్పతనం, ప్రతిభ తెలిసి ఆయనతో ఏకవచనంతో మాట్లాడటం మానుకున్నానని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. బాలుని మీరు అని సంభోదించేవాడినని అన్నారు. దానికి బాలు ఫీలయ్యి.. ‘‘ఏంటయ్యా! అన్నయ్య అని ఆప్యాయంగా పలకరించేవాడివి మీరు అని దూరం చేస్తావేంటి’’ అని చనువుగా మందలించేవారని తన జ్ఞాపకాలను చిరంజీవి పంచుకున్నారు. అలాంటి ఆప్యాయత, ప్రేమ తమ మధ్య ఉండేదని వెల్లడించారు.

Also Read: