తమ్ముడు అడిగితే ఆ సినిమా ఇచ్చేస్తా: చిరంజీవి

Share Icons:
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి సుమారు పదేళ్లు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాణించలేక, అసలు ఆ రంగం తనకు సరిపడదని భావించి మళ్లీ తనకిష్టమైన వెండితెర వైపే వచ్చేశారు చిరు. ‘ఖైదీ నెం. 150’ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. కిందటేడాది తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. అయితే, ఈ సినిమా తరవాత చేయబోయే ప్రాజెక్ట్‌ల గురించి చిరంజీవి తాజాగా మాట్లాడారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ హక్కులను రామ్ చరణ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఆ పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారు. ఈ సినిమా మినహా మరే ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం నలుగురైదుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ‘లూసిఫర్’ రీమేక్‌కు ఇంకా దర్శకుడు ఎవరనేది కూడా నిర్ణయించుకోలేదని చిరంజీవి చెప్పారు.

Also Read:

అయితే, ‘లూసిఫర్’ సినిమాను పవన్ కళ్యాణ్ చేయబోతున్నారనే వదంతులు కూడా వచ్చాయి. వీటిపై చిరంజీవి స్పందించారు. ‘‘ఆ సినిమా నేనే చేస్తా. తమ్ముడు చేయాలని ఉత్సాహపడితే తప్పకుండా తనకు ఇచ్చేస్తా. తనకు చేయాలనుందనే విషయం అయితే నా వరకు రాలేదు’’ అని ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి స్పష్టం చేశారు. తాను సోషల్ మీడియాలో చేరడం గురించి కూడా చిరంజీవి మాట్లాడారు. నిజానికి సోషల్ మీడియా గురించి తనకు తెలియదని అన్నారు. ప్రజలకు ఒక్కోసారి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేనని, ప్రెస్ నోట్ ఇస్తే పూర్తిస్థాయిలో వెళ్తుందో లేదో తెలియదని చిరంజీవి వెల్లడించారు. అందుకే, తానే స్వయంగా ప్రజలతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచానని తెలిపారు.