తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణూ దేశాయ్.. ఇది కదా మార్పు మనతో మొదలు అంటే!

Share Icons:
పవన్ మాజీ భార్య రేణూదేశాయ్‌లో ఫెమినిజమ్ భావాలే కాదు.. కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే. తనకు నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ.. వ్యక్తిగత జీవిత విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే రేణూ దేశాయ్.. ఓ మంచి పనికోసం తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఇలా చేయండి.. అలా చేయండి.. అని ఎదుటి వారికి చెప్తున్నాం అంటే.. ఆ పని మనతోనే మొదలవ్వాలనే స్వభావం ఉన్న మార్పు నాతోనే అంటూ కొత్త ఆలోచనకు తెరతీసింది.

రేణూ దేశాయ్‌కి కార్లు అంటే చాలా ఇష్టం.. తన బిడ్డలు అఖిరా-ఆద్యలు కూడా కార్లను ఇష్టపడటంతో ఆడి ఏ6, పోర్ష్ బాక్స్టెర్ లగ్జరీ కార్లను గతంలో కొనుగోలు చేసింది రేణూ దేశాయ్. అయితే పెట్రోల్ డీజిల్ కార్లు వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు సంభవిస్తుందని.. పీల్చేగాలిలో కార్బన్ శాతం పెరిగిపోతుందని.. వీటివల్ల చాలా అనర్ధాలు సంభవిస్తున్నాయని ఓ కథనం ద్వారా తెలుసుకున్న రేణూ దేశాయ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ విపత్తుకి తన వంతు బాధ్యత వహిస్తూ.. తన దగ్గర ఉన్న రెండు లగ్జరీ కార్లను అమ్మేశారు రేణూ దేశాయ్. పెట్రోల్, డీజిల్‌‌తో నడిచే కార్లను కాకుండా విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రికల్ కారును కొనుగోలు చేశారు. కార్లు అమ్మడం కష్టంగా అనిపించినా, ఇంధనంతో భూమిపై నివసించే జీవరాశులు క్యాన్సర్ బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారామె.

ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కి కూడా రిక్వెస్ట్ చేసింది రేణూ.. పర్యావరణాన్ని కాపాడాలంటే పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించాలని విజ్ఞ‌ప్తి చేసింది రేణూ. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసి శెభాష్ అనిపించుకుంటుంది రేణూ. కోట్లుకి కోట్లు సంపాదిస్తూ.. నెలకో ఖరీదైన కారుతో చక్కర్లు కొడుతూ కనిపించే చాలామంది సినీ, రాజకీయ సెలబ్రిటీలకు రేణూ తీసుకున్న నిర్ణయం కనువిప్పు అనే చెప్పాలి.

ఆ ఛాలెంజ్‌లు ఈ ఛాలెంజ్‌లు అంటూ జనానికి రూపాయి ఉపయోగం లేని పనికి మాలిన ఛాలెంజ్‌ల కంటే.. పర్యావరణాన్ని పరిరక్షించే ఈ కార్ల అమ్మే ఛాలెంజ్‌‌కి సెలబ్రిటీలు సై అని ముందుకు వచ్చి అమ్మకాలు మొదలుపెడితే బాగుంటుందేమో..!