టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇదేం లెక్క..?: కేన్

Share Icons:
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పెదవి విరిచాడు. టెస్టులకి ఆదరణ పెంచేందుకు గత ఏడాది ఆగస్టులో ఈ ఛాంపియన్‌షిప్‌ని ఐసీసీ తెరపైకి తీసుకురాగా.. మొత్తం 9 దేశాలు పోటీపడుతున్నాయి. కానీ.. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లకి ఐసీసీ కేటాయిస్తున్న పాయింట్లు ఆమోదయోగ్యంగా లేదని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

Read More:

అసలు ఈ అంటే ఏంటంటే..? 2019, ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది. ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లని ఐసీసీ కేటాయిస్తుండగా.. మ్యాచ్ సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు.

Read More:

గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఏడు టెస్టులాడిన భారత్ జట్టు.. ఏడింటిలోనూ గెలిచి ప్రస్తుతం 360 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ టీమ్.. ఐదు మ్యాచ్‌లాడి ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే.. భారత్ జట్టు తక్కువ మ్యాచ్‌లు ఉండే సిరీస్‌లని ఆడటం ద్వారా ఎక్కువ పాయింట్లని సాధించగలిగిందనే విమర్శలు ఉన్నాయి. ఎలా అంటే.. సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఉంటే.. అప్పుడు ఒక్కో మ్యాచ్‌కి 40 పాయింట్లు కేటాయిస్తారు. అలానే రెండు మ్యాచ్‌లే ఉంటే ఒక్కో మ్యాచ్‌కి 60 పాయింట్లని ఇస్తారు.

‘టెస్టులకి ఆదరణ పెంచేందుకు ఐసీసీ తెలివిగానే టెస్టు ఛాంపియన్‌షిప్‌ని నిర్వహిస్తోంది. కానీ.. పాయింట్ల కేటాయింపు విషయంలోనే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఎలా అంటే.. కొన్ని జట్లు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతున్నాయి. మరికొన్ని.. కేవలం రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడతాయి. కానీ.. ఎన్ని మ్యాచ్‌ల సిరీస్ అయినా 120 పాయింట్లే కేటాయించడం సబబు కాదు’ అని విలియమ్సన్ నిరాశ వ్యక్తం చేశాడు.