టీ20 వరల్డ్‌కప్ వాయిదా..? ఆస్ట్రేలియా ముందు 4 ప్రశ్నలు

Share Icons:
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేశారు. దాంతో.. టీ20 వరల్డ్‌కప్ జరగడంపై సందిగ్ధత నెలకొనగా.. ఈ నెల 28న అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో సమావేశంకానున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకోనుంది.

ఐసీసీ నిర్వహించనున్న ఈ మీటింగ్‌లో టీ20 వరల్డ్‌కప్‌కి ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే..?

1. అక్టోబరులో 16 క్రికెట్ జట్లు ఆస్ట్రేలియాకి వచ్చేందుకు మీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..? 2. సెప్టెంబరు వరకూ మీ దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.. మరి టీ20 వరల్డ్‌కప్‌కి ఏర్పాట్లు ఎలా చేయగలుగుతారు..? 3. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మీ దేశంలో క్వారంటైన్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి..? 4. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే టాప్ క్రికెట్ జట్లు వరల్డ్‌కప్ ఆడేందుకు మీ దేశానికి వస్తాయని అనుకుంటున్నారా..?
Read More:

కరోనా వైరస్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌ని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రాథమికంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కి సూచించింది. దాంతో.. ఆదాయం, ఆదరణ పరంగా చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఐసీసీతో పాటు సీఏ కూడా కంగారుపడుతోంది. కాబట్టి.. షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్ జరగడం సందేహామేనని ఇటీవల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం అభిప్రాయపడ్డాడు.

Read More:

టీ20 వరల్డ్‌కప్ రద్దయితే.. ఆ అక్టోబరు – నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోంది. దాంతో.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఇప్పటికే వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కానీ.. తెరవెనుక ఇప్పటికే శ్రీలంక, దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల క్రికెట్ బోర్డుల మద్దతుని కూడగట్టుకున్న బీసీసీఐ.. టీ20 వరల్డ్‌కప్ వాయిదా కోసం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.