టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్ బోల్తా.. మళ్లీ ఆసీస్‌దే కప్

Share Icons:
ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో భారత్ జట్టు ఫైనల్లో బోల్తాపడింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్‌కి చేరిన భారత్ జట్టు.. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో చేతులెత్తేసింది. తొలుత పేలవ బౌలింగ్ కారణంగా ఆస్ట్రేలియాకి 184 పరుగులు సమర్పించుకున్న భారత్ జట్టు.. అనంతరం ఛేదనలో అనూహ్యంగా 19 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ గెలవడం ఇది ఐదోసారికాగా.. తొలిసారి ఫైనల్ ఆడిన అంచనాల్ని అందుకోలేకపోయింది.

185 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ షెఫాలి వర్మ (2) ఔటవగా.. మరో ఓపెనర్ మంధానా (11), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (4) ఫేలవఫామ్‌ని కొనసాగించారు. ఇక మిడిలార్డర్ బ్యాటర్లు తనియా భాటియా (2), జెమీమా రోడ్రిగ్స్ (0) కూడా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమవడంతో భారత్ జట్టు 11.3 ఓవర్లు ముగిసే సమయానికి 58/5తో ఓటమికి చేరువైంది. ఆఖర్లో దీప్తి శర్మ (33: 35 బంతుల్లో 2×4), వేద (19), రిచ ఘోస్ (18) కాసేపు క్రీజులో నిలిచినా.. వారి ఇన్నింగ్స్‌ గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.

ఇప్పటి వరకూ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్ జరగగా.. అన్నిసార్లూ ఫైనల్‌కి చేరిన ఆస్ట్రేలియా జట్టు ఈరోజు టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఓవర్‌ నుంచే వ్యూహాత్మంగా ఆడిన ఆసీస్ ఓపెనర్లు ఓపెనర్లు హేలీ (75: 39 బంతుల్లో 7×4, 5×6), మూనీ (78 నాటౌట్: 54 బంతుల్లో 10×4) మొదటి 10 ఓవర్లలో భారత బౌలర్లకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా.. హేలీ భారీ షాట్లు ఆడేసింది. భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న శిఖ పాండే బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన హేలీ.. స్కోరు బోర్డుని ఉరకలెత్తించింది.

జట్టు స్కోరు 115 వద్ద హేలీ ఔటవగా.. ఆ తర్వాత బ్యాట్ ఝళిపించిన మూనీ ఆఖర్లో గేర్ మార్చి ఎడాపెడా బౌండరీలు సాధించింది. మధ్యలో కెప్టెన్ లానింగ్ (16), గార్డనెర్ (2), హైన్స్ (4) వికెట్లని భారత్ పడగొట్టినా.. అప్పటికే ఆస్ట్రేలియా భారీ స్కోరుకి దగ్గరైపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. పూనమ్ యాదవ్, రాధ యాదవ్ చెరొక వికెట్ తీశారు.