టీ20 ర్యాంకింగ్స్‌లో షెఫాలికి చేజారిన నెం.1

Share Icons:
ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ షెఫాలి వర్మ తన నెం.1 ర్యాంక్‌‌ని చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో కేవలం 2 పరుగులే చేసి ఔటైన షెఫాలి వర్మ ఒక్కసారిగా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఇదే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ (78 నాటౌట్: 54 బంతుల్లో 10×4) నెం.1 స్థానానికి ఎగబాకింది. తొలిసారి ఫైనల్ ఆడిన భారత్ జట్టు 85 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Read More:

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 762 పాయింట్లతో మూనీ నెం.1 స్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌కి చెందిన సూజీ బేట్స్ 750 పాయింట్లతో నిలిచింది. ఇక మూడో స్థానంలో షెఫాలి వర్మ 744 పాయింట్లతో నిలవగా.. భారత్‌కే చెందిన ఓపెనర్ మంధాన (661 పాయింట్లు), జెమీమా (643) వరుసగా 7, 9వ స్థానాల్లో నిలిచారు.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌కి నిరాశే ఎదురైంది. దీప్తి శర్మ, రాధ యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-5లో దీప్తి శర్మ 302 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో ఆడిన ప్రతిసారి ఫైనల్‌కి చేరిన ఆస్ట్రేలియా జట్టు.. ఐదోసారి విజేతగా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.