వాస్తవానికి ఈ యాత్ర షెడ్యూల్‌ను జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకూ కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా తేదీలను మార్చి, జులై 21కు వాయిదా వేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం (ఎస్ఏఎస్బి) బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు.
జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని దాదాపు 12,756 అడుగుల ఎత్తులోని అమర్నాథ్ గుహలకు దక్షిణ కశ్మీర్లో పహల్గామ్ నుంచి ఐదు రోజులపాటు కాలినడక వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఆ మార్గంలో యాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. కేవలం ఉత్తర కశ్మీర్లో బల్తాల్ క్యాంప్ ద్వారా మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. 2019లోనూ అమర్నాథ్ యాత్రను అర్ధాంతరంగా ముగించిన విషయం తెలిసిందే. తాజా మార్గదర్శకాల ప్రకారం సాధువులు మినహా 55 ఏళ్లు దాటినవారికి యాత్రకు అనుమతి లేదు. యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలి. యాత్రకు వెళ్లడానికి ముందే జమ్మూ కశ్మీర్ అధికారులకు దీనిని అందజేయాల్సి ఉంటుంది.