చిరు కోసం.. మొన్న విజయశాంతి, నిన్న సుహాసిని, నేడు ఖుష్బూ!!

Share Icons:
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను మెగాస్టార్ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’తో బిజీగా ఉన్న చిరంజీవి.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్‌ను మొదలుపెడతారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించనున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సుజీత్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. అలాగే, నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నట్టు సమాచారం.

‘లూసిఫర్’లో మోహన్‌లాల్ పోషించిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కూడా భాగం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, మంజు వారియర్ చేసిన పవర్‌ఫుల్ రోల్ కోసం ఇప్పుడు చిత్ర యూనిట్ వేట మొదలుపెట్టిందట. ఈ పాత్ర కోసం మొదట విజయశాంతి పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరవాత సుహాసిని పేరు వినిపించింది.

Also Read:

కానీ, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం మంజు వారియర్ చేసిన పాత్ర కోసం ఖుష్బూను సంప్రదించారట. ఆమె కూడా ఈ పాత్రలో నటించడానికి అంగీకరించారని అంటున్నారు. చిరంజీవితో ఖుష్బూ నటించడం కొత్తేమీ కాదు. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి ఖుష్బూ అక్కగా నటించారు. ఆ సినిమాలో అక్క, తమ్ముడిగా చిరంజీవి, ఖుష్బూ కెమిస్ట్రీ బాగా పండింది. కాబట్టి, ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ మంజు వారియర్ పాత్రకు ఖుష్బూ మంచి చాయిస్‌ అని అంతా అంటున్నారు. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.