చిరంజీవి మళ్లీ పుట్టాడు.. మేఘనా రాజ్ కోరిక నెరవేరింది!

Share Icons:
దివంగత కన్నడ నటుడు భార్య మేఘనా రాజ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకర వార్తను చిరంజీవి తమ్ముడు, హీరో ధ్రువ సర్జా గురువారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘మగ బిడ్డ.. జై హనుమాన్’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు.

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న బెంగళూరులో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. 36 ఏళ్లకే ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కన్నుమూసేటప్పకి మేఘనా రాజ్ గర్భవతి. ఇప్పుడు ఆమెకు మగ బిడ్డ పుట్టడంతో అభిమానులు చిరంజీవి మళ్లీ పుట్టాడని ఆనందపడుతున్నారు. జూనియర్ చిరంజీవి వచ్చేశాడని సంబరపడుతున్నారు.

కాగా, హాస్పిటల్‌లో తన అన్నయ్య బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ధ్రువ సర్జా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్పిటల్‌లోనే చిరంజీవి ఫొటో వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదాలను అందించారు.

చిరంజీవి కన్నుమూసిన కొన్ని రోజుల తరవాత తాను తల్లి కాబోతున్న విషయాన్ని మేఘనా రాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పరలోకంలో ఉన్న తన భర్తకు ఈ విషయాన్ని చెబుతూ, తన భర్త జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గుండెను కరిగించే సందేశాన్ని సోషల్ మీడియాలో పెట్టారు మేఘన. ‘‘నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు. నువ్వు నాలోనే ఉన్నావు. ఐ లవ్ యు’’ అంటూ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించారు. తన దృష్టిలో చిరంజీవి అంటే ఏంటో చెప్పడానికి ఈ విశ్వంలోని పదాలన్నీ సరిపోవని భావేద్వేగానికి గురయ్యారు.

‘‘నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తావు. అందుకే, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టవు. అవునా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకు గుర్తుగా నువ్వు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి. ఈ తీయని అద్భుతాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నిన్ను మన బిడ్డగా మళ్లీ ఈ భూమిపైకి తీసుకురావడానికి, నిన్ను మళ్లీ ఎత్తుకోవడానికి, నీ చిరునవ్వును మళ్లీ చూడటానికి, నీ నవ్వును మళ్లీ వినడానికి వేచి చూస్తున్నాను’’ అని ఆ సందేశంలో మేఘన పేర్కున్నారు. ఆమె కోరిక ఇప్పుడు నెరవేరింది. చిరంజీవి మళ్లీ బిడ్డగా మేఘన ఒడికి చేరారు.

Also Read: