చిత్రపురి కాలనీలో హాస్పిటల్, స్కూల్.. మంత్రి తలసాని హామీ

Share Icons:
సినీ, టీవీ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంత్రిని 24 విభాగాలకు చెందిన వివిధ యూనియన్ల ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. తమకు తెల్ల రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు వర్తింప చేయాలని కోరారు.

చిత్రపురి కాలనీలో నాలుగు వేల మంది ఉంటున్నారని, వారి కోసం హాస్పిటల్, పాఠశాలను నిర్మించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. లాక్‌డౌన్ సమయంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలోని 14 వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిత్రపురి కాలనీలో హాస్పిటల్, పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read:

సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం బెస్ట్ పాలసీని తయారు చేస్తుందని, అందులో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమంపై కూడా పొందుపర్చడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున ఇతర సినీ ప్రముఖులతో చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇస్తామని అన్నారు. CMRF ద్వారా వైద్య సేవలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. మంత్రితో పాటు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు కూడా ఉన్నారు.

మంత్రిని కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కోమర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పీఎస్ఎన్ దొర, అనిల్, తెలుగు సినీ, టీవీ కాస్టూమర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింహారావు, నాగేంద్ర ప్రసాద్, వాసు, లలిత, సురేష్, రాజేశ్వర్ రెడ్డి, బాబ్జీ, రాంబాబు, మూర్తి, ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.