చరణ్ పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత.. గుర్తుచేసుకున్న చిరంజీవి

Share Icons:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వచ్చేసింది. అయితే, కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో తన పుట్టినరోజును జరుపుకోవడం లేదని ఇప్పటికే చరణ్ ప్రకటించారు. అభిమానులు కూడా తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. #HBDRoyalRAMCHARAN హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మారుమోగిపోతోంది. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ స్పెషల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, తాజాగా సోషల్ మీడియాలో చేరిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు, నట వారసుడు అయిన రామ్ చరణ్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి చరణ్‌తో తీసుకున్న అప్పటి ఫొటోను పోస్ట్ చేసిన చిరంజీవి.. చరణ్ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటో వెల్లడించారు. ‘‘చరణ్ పుట్టినప్పుడు నేను సహజంగానే చాలా సంతోషించాను. దానికి గల కారణం ఏంటో తరవాత తెలిసింది. చరణ్ పుట్టింది మార్చి 27న. ఆ రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం. నీటిలోకి చేప వెళ్లినట్టుగా చరణ్ నటనలోకి అడుగుపెట్టాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సంతోష క్షణాలు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే, చిరంజీవి పోస్ట్ చేసిన ఫొటో చాలా బాగుంది. బహుశా అప్పుడు చరణ్ వయసు నెలల్లోనే ఉంటుంది. ముద్దుముద్దుగా భలే ఉన్నాడు. కొడుకుని రెండు చేతులతో ఒడిసి పట్టుకుని ఆప్యాయంగా ముద్దాడుతున్నారు చిరంజీవి. కాగా, ఈ పోస్ట్‌కు మంచి స్పందన వస్తోంది. చెర్రీ లాంటి మంచి నటుడిని తమకు అందించినందకు థ్యాంక్స్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా చరణ్ ఎవ్వరూ ఊహించనంత స్థాయికి వెళ్లిపోతారని ఆశీర్వదిస్తున్నారు. మొత్తం మీద చిరంజీవి చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చినా తన పోస్టులు, ట్వీట్లతో అభిమానులను కట్టిపడేస్తున్నారు.