గౌతమ్ కాబోయే హీరో.. రాజమౌళితో కచ్చితంగా సినిమా చేస్తా: మహేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు

Share Icons:
తన తండ్రి నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (మే 31న) తన కొత్త సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మహేష్. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ టైటిల్ పోస్టర్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, ఆదివారం సాయంత్రం మహేష్ బాబు తన అభిమానులను మరోసారి ఫిదా చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సుమారు గంటపాటు ఈ ఛాట్ ప్రోగ్రాం సాగింది. అభిమానులు చాలా ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటికి అంతే ఆసక్తికరంగా మహేష్ బాబు సమాధానాలు చెప్పారు. గౌతమ్ హీరో అవుతాడా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘అతను కోరుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. కాలమే చెబుతుంది’’ అని సమాధానం ఇచ్చారు.

Also Read:

అలానే, ‘‘రాజమౌళితో మీరు సినిమా చేస్తారని మేం ఆశించొచ్చా?’’ అని ఒక అభిమాని మహేష్‌ను అడిగారు. దీనికి మహేష్ అవుననే సమాధానం ఇచ్చారు. ‘‘అవును, కచ్చితంగా మీరు ఆశించొచ్చు. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లలో నేనూ ఒకడిని’’ అని మహేష్ రిప్లై ఇచ్చారు. అంటే, RRR తరవాత రాజమౌళి పనిచేయబోయేది మహేష్‌తోనేనని ఒక స్పష్టత వచ్చింది. మహేష్ చెప్పిన మరికొన్ని సమాధానాల్లో ఆసక్తికరమైనవి మీకోసం..


లాక్‌డౌన్ తరవాత లైఫ్ ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు?
లాక్‌డౌన్ తరవాత జీవితం కచ్చితంగా వేరేగా ఉంటుంది. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఈ కొత్త పరిస్థితిని మనందరం పాటించాలి. కాబట్టి, అందరూ సురక్షితంగా ఉండండి.


మీకు ఇష్టమైన జంక్ ఫుడ్ ఏంటి సార్?
బర్గర్లు, పిజ్జాలు


మీ పెంపుడు శునకాల పేర్లేమిటి?
నొబిటా, ప్లూటో


మీ గురించి ఒక సీక్రెట్ చెప్పండి?
ఇదొక రహస్యం. మీకు నేను ఎలా చెబుతాను.


మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?
మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి.. అలాగే నా ఆల్‌టైమ్ ఫేవరేట్ సచిన్ టెండూల్కర్.


మీ నిక్ నేమ్ ఏంటి సార్?
నాని


ఖాళీ సమయంలో మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు?
పుస్తకాలు చదువుతాను. బోలెడన్ని సినిమాలు చూస్తాను. ఈతకొడతాను. నా పిల్లలతో ఆడుకుంటాను. అలాగే, నా శునకాలతో ఆడుకుంటాను. నా చేతిలో చాలా అంశాలు ఉన్నాయి.


మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
నమ్రతా శిరోద్కర్


మీ కొత్త సినిమా థీమ్ ఏంటి సార్?
‘సర్కారు వారి పాట’ ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. అలాగే, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చేయడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది.


సితార, గౌతమ్.. వీరిద్దరిలో ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు?
వారిద్దరూ నాలో భాగం. వారిలో ఒకరిని తక్కువగా ఎలా ప్రేమించగలను?


టీ, కాఫీల్లో మీకు ఏది ఇష్టం?
నేను కాఫీ పర్సన్‌ని.


మీకు ఎంతో ఇష్టమైన మునగకాయ మటన్ వంటకం గురించి ఒక్క మాటలో చెప్పండి.
ఇప్పుడు గుర్తుచేయొద్దు..


మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా?
నాకు 26 ఏళ్ల వయసులో ఉండేది. అప్పుడే నమ్రతను పెళ్లిచేసుకున్నాను.


వర్షం పడుతోంది, వాతావరణం చాలా బాగుంది. ఇలాంటప్పుడు మీకు ఏ స్నాక్ తినాలనిపిస్తుంది?
అల్లం టీతో మిర్చి బజ్జీ


పూరీ గారితో భవిష్యత్తులో ఒక సినిమా చేస్తారా? వెయిటింగ్ సార్
కచ్చితంగా చేస్తాను. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన నా దగ్గరకు వచ్చి ఒక కథ చెబుతారని ఇప్పటికీ వేచి చూస్తున్నాను.


టీ20, టెస్ట్ క్రికెట్.. ఈ రెండు ఫార్మాట్లలో ఏదంటే మీకు ఇష్టం?
టెస్ట్!! ఈ విషయంలో రెండు అభిప్రాయాలు లేవు.


మీ గురించి ఏం గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు?
నేనొక గొప్ప నటుడిగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే, నా పిల్లలకు అద్భుతమైన తండ్రిగా, నా భార్యకు మంచి భర్తగా గుర్తిండిపోవాలి.


హాయ్ సార్.. నా పేరు మణి.. మిమ్మల్ని ఒక జేమ్స్ బాండ్ మూవీలో చూడాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మేం ఆశించొచ్చా?
మణి.. మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే నాకు పంపించండి. నాకు ఇలాంటి ఒక సినిమా చేయాలని ఉంది.


సమంత, రష్మికల్లో మీరు ఎవరిని ఇష్టపడతారు?
వాళ్లిద్దరూ నాకు ఎంతో ఇష్టం. వాళ్లు అద్భుతమైన సహనటులు.


మీ పిల్లల కోసం మీరు వండగలిగే మంచి వంటకం ఏంటి?
మ్యాగీ నూడిల్స్


మీ ఫేవరేట్ గేమ్ ఏంటి సార్?
నా కొడుకుతో ఆన్‌లైన్‌లో టెన్నిస్, గోల్ఫ్, బేస్‌బాల్ ఆడటం అంటే ఇష్టం.


మీకు ఇష్టమైన రంగు, ఆహారం ఏంటి?
నాకు ఇష్టమైన రంగు నీలం. నాకు సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.