గేర్ మార్చిన సుశాంత్.. ఇక బండి రయ్ రయ్!!

Share Icons:
ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన యంగ్ హీరో .. ఇప్పుడు మరోసారి సోలో హీరోగా వస్తున్నారు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌. ఎస్‌. ద‌ర్శన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్లపై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే, సెప్టెంబ‌ర్ 20న న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ మూవీ నుంచి సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రం బృందం విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో సుశాంత్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ మోటార్ బైక్‌పై స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌పై ‘‘గేర్ మార్చి బండి తియ్!!!’’ అని టైటిల్‌కు తగ్గట్టుగా కొటేషన్ రాసి పెట్టారు. హీరో ఎలాంటి సెల‌బ్రేష‌న్ మోడ్‌లో ఉన్నాడో ఈ కోట్ తెలియజేస్తుంది.

వ‌చ్చే వారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ అఫిషియ‌ల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ‘‘లెజెండ్‌ ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటూ త్వర‌లో ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ షూటింగ్ మొదలుపెడతాం’’ అని ట్వీట్ చేశారు.

హీరో సుశాంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. మొద‌ట తాత‌య్య అక్కినేని నాగేశ్వర‌రావును గుర్తు చేసుకుంటూ ‘‘ఆప్యాయ‌త నిండిన అన్ని జ్ఞాప‌కాలు ఈ రోజు ఎక్కువ‌గా మెదులుతున్నాయి. తాతా.. మీ లాగా ఇంకెవ‌రూ ఉండ‌రు. మీ జీవితంలో ఒక చిన్న భాగ‌మైనందుకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను, కృత‌జ్ఞుడ‌నై ఉంటాను’’ అని భావోద్వేగ‌పూరితంగా రాసుకొచ్చారు. ఆ త‌ర్వాత‌, ‘‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్!!!’’ అని ట్వీట్ చేశారు సుశాంత్‌.

ఇప్పటికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌కు సైతం మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని చిత్ర బృందం తెలిపింది. ప్రవీణ్ ల‌క్కరాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్. వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస‌, కృష్ణచైత‌న్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: