గుర్తుందా శీతాకాలం: ఆగిపోయిన తమన్నా, సత్యదేవ్ సినిమా!!

Share Icons:
కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఈ ఏడాది జూలైలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్‌తో రూపొందనున్న ఈ రీమేక్‌ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ , మిల్కీ బ్యూటీ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆయనే నిర్మాత కూడా. కాల భైరవ సంగీత దర్శకుడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అప్పట్లో నిర్మాత ప్రకటించారు.

ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ఇప్పటి వరకు చాలా వదంతులు వినిపించాయి. ఈ సినిమా కోసం మొదట తక్కువ రెమ్యునరేషన్ మాట్లాడుకున్న సత్యదేవ్.. ఆ తరవాత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని రూమర్లు వచ్చాయి. మహేష్ కోనేరుకు చెందిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో ‘తిమ్మరుసు’ అనే సినిమా చేస్తోన్న సత్యదేవ్.. అక్కడ కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, అంతే మొత్తాన్ని ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకు ఆయన డిమాండ్ చేస్తున్నారని వదంతులు వ్యాపించాయి.

ఈ రూమర్‌లో నిజమెంతో తెలియక ముందే మరో రూమర్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా పూర్తిగా ఆగిపోయిందని. మరి ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏంటో తెలీదు కానీ.. ఈ వార్త అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్. అయితే, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు, ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఆగిపోవడం వల్లే సత్యదేవ్ ‘తిమ్మరుసు’ చిత్రాన్ని ప్రారంభించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.