క్లీన్ బౌల్డ్ ఎలా..? రషీద్ గూగ్లీకి.. నోరెళ్లబెట్టిన కెవిన్ ఓబ్రైన్

Share Icons:
బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించడంలో స్పిన్నర్ల స్టయిల్ వేరు. మరీ ముఖ్యంగా.. గూగ్లీని సంధించి బ్యాట్స్‌మెన్‌ని క్లీన్ బౌల్డ్ చేస్తే ఆ స్పిన్నర్‌కి వచ్చే కిక్కే వేరు. తాజాగా ఇంగ్లాండ్ స్పిన్నర్ .. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ ఓబ్రైన్‌ని బోల్తా కొట్టించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెగ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్‌తో బంతిని ఆఫ్ కట్ చేసిన రషీద్ తెలివికి ఓబ్రైన్ నోరెళ్లబెట్టాడు.

సౌథాంప్టన్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన రెండో వన్డేలో ఐర్లాండ్ 39/3తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన కెవిన్ ఓబ్రైన్ (3: 7 బంతుల్లో) జట్టు స్కోరు 44 వద్దే క్లీన్ బౌల్డయ్యాడు. ఆదిల్ రషీద్ లెగ్ స్పిన్ యాక్షన్‌తో బంతిని సంధించడంతో.. బంతి లెగ్ కట్ అవుతుందని ఊహించిన కెవిన్ ఓబ్రైన్ ఆ మేరకు తన ఫుట్‌వర్క్‌ని మార్చుకుని బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. అనూహ్యంగా ఆఫ్ కట్ అయిన బంతి బ్యాట్, ఫ్యాడ్స్ మధ్యలో నుంచి వెనక్కి వెళ్లి లెగ్ స్టంప్‌ని గీరాటేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 32.3 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 216/6తో ఛేదించేసింది. దాంతో.. మూడు వన్డేల సిరీస్‌ని ఇంగ్లాండ్ 2-0తో చేజిక్కించుకోగా.. నామమాత్రమైన ఆఖరి వన్డే మంగళవారం జరగనుంది.