క్రికెట్‌లో నెం.1 రికార్డ్‌ ముంగిట రాస్ టేలర్

Share Icons:
న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్ అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. భారత్‌తో ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ తలపడనుండగా.. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో టేలర్ ఆడినా..? క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కనీసం 100 మ్యాచ్‌లాడిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు.

న్యూజిలాండ్ జట్టులోకి 2006లో అరంగేట్రం చేసిన ఇప్పటి వరకూ 99 టెస్టులు, 231 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో.. 100వ టెస్టులో అతను ఆడితే..? అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌ల మైలురాయిని అతను అందుకోనున్నాడు. ఇటీవల భారత్‌తో ముగిసిన ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో నిలకడగా రాణించిన టేలర్.. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

100వ టెస్టుని ఆడనున్న నేపథ్యంలో రాస్‌ టేలర్ మాట్లాడుతూ ‘నా 14 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకూ సాధించిన ఘనతలపై చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్యామిలీ నుంచి నాకు మంచి సహకారం లభించింది. ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతని నా భార్యే తీసుకుంది. పిల్లలు కూడా ఒక క్రికెటర్‌గా నా పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్నారు. వారి సహకారంతోనే నేను ఫ్యామిలీ, క్రికెట్‌ని ఇన్నాళ్లు బ్యాలెన్స్ చేయగలిగాను’ అని వెల్లడించాడు.