కోల్‌కతాని హాఫ్ సెంచరీతో ఆదుకున్న కమిన్స్.. ముంబయి టార్గెట్ 149

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాప్ ఆర్డర్ మరోసారి చేతులెత్తేసింది. ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన పాట్ కమిన్స్ (53 నాటౌట్: 36 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. పేరు మోసిన హిట్టర్లందరూ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోగా.. ఆరో వికెట్‌కి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (39 నాటౌట్: 29 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి 87 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన కమిన్స్ కోల్‌కతాకి గౌరవమైన స్కోరుని అందించాడు. తాజా సీజన్‌ కోసం కమిన్స్‌ని వేలంలో రూ. 15.50 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. శుభమన్ గిల్ (21: 23 బంతుల్లో 2×4)తో కలిసి కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్ త్రిపాఠి (7: 9 బంతుల్లో 1×4) మూడో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (5), దినేశ్ కార్తీక్ (4) తేలిపోగా.. ఆండ్రీ రసెల్ (12: 9 బంతుల్లో 1×4, 1×6) పేలవ ఫామ్‌ని కొనసాగించాడు. దాంతో.. 10.4 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 61/5తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివరి వరకూ క్రీజులో నిలిచిన ఇయాన్ మోర్గాన్- పాట్ కమిన్స్ జోడీ.. కోల్‌కతాకి గౌరవమైన స్కోరుని అందించింది. పాట్ కమిన్స్‌కి ఐపీఎల్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, కౌల్టర్ నైల్, బుమ్రా తలో వికెట్ తీశారు.