కోల్‌కతాతో మ్యాచ్‌లో హైదరాబాద్ టార్గెట్ 164

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాప్ ఆర్డర్ మరోసారి చేతులెత్తేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అబుదాబి వేదికగా ఆధివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ శుభమన్ గిల్ (36: 37 బంతుల్లో 5×4), ఇయాన్ మోర్గాన్ (34: 23 బంతుల్లో 3×4, 1×6), దినేశ్ కార్తీక్ (29 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బసిల్ థంపీ, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సాహసోపేతంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. శుభమన్‌ గిల్‌తో కలిసి కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్ త్రిపాఠి (23: 16 బంతుల్లో 2×4, 1×6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో తొలి పవర్ ప్లే ముగిసేలోపే ఔటైపోగా.. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (29: 20 బంతుల్లో 3×4, 1×6), ఆండ్రీ రసెల్ (9: 11 బంతుల్లో 1×4) సిక్స్ కొట్టే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నారు. దాంతో.. 15 ఓవర్లు ముగిసే సమయానికి 105/5తో నిలిచిన కోల్‌కతా తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకునేలా కనిపించింది. కానీ.. స్లాగ్ ఓవర్లలో దూకుడుగా ఆడిన దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ ఆ టీమ్‌కి 163 పరుగుల స్కోరుని అందించగలిగారు. ఈ జోడీ చివరి మూడు ఓవర్లలోనే ఏకంగా 42 పరుగులు రాబట్టడం గమనార్హం.