‘కె.జి.ఎఫ్ 2’ డిజిటల్ రైట్స్.. షాక్‌కు గురిచేస్తోన్న డీల్!

Share Icons:
కన్నడ సినిమా స్థాయిని పెంచిన చిత్రం ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’. ఈ ఒక్క సినిమాతో శాండిల్‌వుడ్ స్టామినా ఏంటో దేశ వ్యాప్తంగా తెలిసింది. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కె.జి.ఎఫ్’ పాన్ ఇండియా మూవీగా విడుదలై అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇంచుమించుగా రూ.250 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు, రూ.100 కోట్లు వసూలుచేసిన తొలి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించింది.

‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ‘కె.జి.ఎఫ్ 2’కు ఉన్న డిమాండ్ కారణంగా బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌‌కు భారీ ధర పలికిందని అంటున్నారు. సుమారు రూ.55 కోట్ల డీల్ కుదిరిందట. ఈ డీల్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషల్లో కలుపుకుని రూ.55 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.

Also Read:

‘కె.జి.ఎఫ్ 2’ను ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో ఇప్పటి నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్‌పై దృష్టిసారించారట. సినిమాకున్న డిమాండ్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. ‘కె.జి.ఎఫ్‌: చాప్టర్ 1’ డిస్ట్రిబ్యూటర్స్‌కు మంచి లాభాలు తీసుకురావడంతో ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ బిజినెస్‌ రూ.300 కోట్లు దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను కూడా అంతే భారీగా రూ.150 కోట్లకు పైగా బడ్జెత్‌తో తెరకెక్కిస్తున్నారు.

హోమబుల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తెలుగులో వారాహి చలనచిత్రం సంస్థ విడుదల చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. అధీరగా ఆయన కనిపించనున్నారు. అలాగే, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, నాజర్, సింహా, అచ్యుత్, వశిష్ట, రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.