కీలక టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్.. మళ్లీ ఆగిన ‘టక్ జగదీష్’ షూటింగ్

Share Icons:
నేచురల్ స్టార్ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ అక్టోబర్ 7న తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు ఆరు నెలలు ఆగిన షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభమైనట్టు నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ప్రారంభమైన 10 రోజులకే ఈ షూటింగ్ మళ్లీ ఆగింది. దీనికి కారణం ‘టక్ జగదీష్’ టీమ్‌లో ఒక టెక్నీషియన్‌కు కొవిడ్-19 పాజిటివ్ రావడమే.

ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ‘టక్ జగదీష్’ టీమ్‌లో కీలక టెక్నీషియన్ ఒకరికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీంతో శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వికారాబాద్‌లో జరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిణామం కారణంగా షూటింగ్‌ను నిలిపివేశారు. యూనిట్‌లో సభ్యులందరికీ టెస్టులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన టెక్నీషియన్ కోలుకున్న తరవాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆ టెక్నీషియన్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ, ఇతర టీమ్ మెంబర్స్ అంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు 50 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. మిగిలిన సగ భాగం పూర్తికావడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏదేమైనా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి జనవరిలో థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది చూస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.