కివీస్ గడ్డపై తొలి టెస్టులో భారత్ చిత్తు

Share Icons:
న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు ఓటమితో ఆరంభించింది. వెల్లింగ్టన్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌లో తేలిపోగా.. బౌలింగ్‌లోనూ అంచనాల్ని అందుకోలేకపోయిది. దీంతో.. తొలి టెస్టులో అలవోక విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇటీవల ఐదు టీ20 సిరీస్‌ని 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైన విషయం తెలిసిందే.

శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 168 పరుగులకే ఆలౌటైంది. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (46: 138 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), చతేశ్వర్ పుజారా (11) తేలిపోయారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, జెమీషన్ చెరో నాలుగు వికెట్లు పడొగట్టగా.. ట్రెంట్ బౌల్ట్‌కి ఒక వికెట్ దక్కింది. రిషబ్ పంత్ (19) రనౌటయ్యాడు.

భారత్‌ని ఆలౌట్ చేసిన తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89: 153 బంతుల్లో 11×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో టెయిలెండర్లు జెమీషన్ (44: 45 బంతుల్లో 1×4, 4×6), ట్రెంట్ బౌల్ట్ (38: 24 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించి కివీస్‌కి మెరుగైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు, షమీ, బుమ్రా చెరొక వికెట్ పడగొట్టారు.

Read More:

కివీస్‌ని 348 పరుగులకి ఆలౌట్ చేసిన తర్వాత 183 పరుగుల తొలి ఇన్నింగ్స్‌లో లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు మరోసారి బ్యాటింగ్‌లో తేలిపోయి 191 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (58: 99 బంతుల్లో 7×4, 1×6) ఒక్కడే హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. కోహ్లీ (19), చతేశ్వర్ పుజారా (11) మరోసారి తేలిపోయారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ ఐదు, ట్రెంట్ బౌల్ట్ నాలుగు, గ్రాండ్‌హోమ్ ఒక వికెట్ తీశాడు.

183 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 191 పరుగులకే కుప్పకూలడంతో న్యూజిలాండ్ ముందు కేవలం 9 పరుగుల లక్ష్యమే నిలిచింది. దీంతో.. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (7 నాటౌట్: 4 బంతుల్లో 1×4), టామ్ బ్లండెల్ (2 నాటౌట్: 6 బంతుల్లో) గెలుపు లాంఛనాన్ని 1.4 ఓవర్లలోనే 9/0తో ఛేదించేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.