కాఫీతో కేఎల్ రాహుల్.. సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు

Share Icons:
భారత స్టార్ క్రికెటర్ కాఫీ తాగుతున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్ల చేతికి చిక్కాడు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవగా.. అప్పటి నుంచి కేఎల్ రాహుల్ ఇంటికే పరిమతమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటోని కేఎల్ రాహుల్ షేర్ చేయగా.. గత ఏడాది ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో నోరుజారి నిషేధాన్ని ఎదుర్కొన్న విషయాన్ని అభిమానులు మళ్లీ గుర్తు చేస్తున్నారు.

2019, జనవరిలో కాఫీ విత్ కరణ్ టాక్ షోక్‌కి హాజరైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా.. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. కేఎల్ రాహుల్ తన జేబులో కండోమ్ ప్యాకెట్లు ఉంచుకునేవాడినని అసభ్యకరంగా మాట్లాడుతూ తన తండ్రికి ఓసారి దొరికిపోగా.. ఫర్వాలేదు సేప్టీ వాడుతున్నావని కితాబిచ్చినట్లు ఆ షోలో వెల్లడించాడు. యువతకి స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా నోరుజారడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా.. రాహుల్, హార్దిక్‌పై అప్పట్లో బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించింది.

టాక్ షోలో వ్యాఖ్యలపై దుమారం రేగడంతో రాహుల్, హార్దిక్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అనంతరం వారిపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేయగా.. గత ఏడాది నుంచి ఇద్దరూ టీమ్‌లో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోయారు. అయితే.. ఇప్పటికీ.. రాహుల్, పాండ్యాకి ఆ టాక్ షో వ్యాఖ్యలు పంటి కింద రాయిలా అప్పుడప్పుడు తగులుతూనే ఉన్నాయి.