‘కలర్ ఫోటో’ రివ్యూ: కాస్త కలర్ తక్కువైంది!

Share Icons:
ప్రేమ కథలన్నీ సుఖాంతం అవ్వవు. విషాదాంత ప్రేమ కథలు ఇప్పటి వరకు మనం ఎన్నో చూశాం. కులం, మతం, పేదధనిక అంతరం అనే కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో చాలా ప్రేమకథలు వచ్చాయి. కానీ, ప్రేమకు వర్ణం అడ్డంకి అనే కాన్సెప్ట్‌తో తొలిసారి వచ్చిన చిత్రం ‘కలర్ ఫోటో’. ఒక వ్యక్తి రంగు ప్రేమకు అంతరాయం అయితే ఎలా ఉంటుంది అనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఆహా’లో అక్టోబర్ 23న విడుదలైంది.

కథ
జయకృష్ణ (సుహాస్) ఇంటింటికి పాలు పోస్తూ కష్టపడి ఇంజినీరింగ్ చదువుతూ ఉంటాడు. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి తండ్రిని బాగా చూసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. మరోవైపు, దీప్తి (చాందిని).. జయకృష్ణ చదివే కాలేజీలోనే చదువుతుంది. ప్రేమను, ప్రేమికులను ద్వేషించే ఎస్‌ఐ రామరాజు (సునీల్) చెల్లెలు ఈ దీప్తి. తన చెల్లెలికి మంచి రంగు ఉన్న అందగాడిని ఇచ్చి పెళ్లి చేయాలని, వాళ్లకు పుట్టే అందమైన కూతురిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనే ఆలోచనలో బతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో నల్లగా ఉండే జయకృష్ణ ప్రేమలో చాందిని పడిపోతుంది. ఈ విషయం రామరాజు తెలుస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది? జయకృష్ణ-చాందిని ప్రేమకథ ఎటు వెళ్లింది? అనేదే సినిమా.

విశ్లేషణ
ఈ సినిమాకు కథా వస్తువు అయిన ‘కలర్’ వినడానికి బాగుంది కానీ తెరపై చూడటానికి మాత్రం బాగాలేదు. ఎందుకంటే మన సమాజంలో ఒక మనిషికి ఇచ్చే విలువలో రంగు కొలమానం అనేది చాలా అరుదు. ఏదో స్కూల్లో, కాలేజీలో స్నేహితులు కామెంట్ చేయడానికి తప్ప అంతకు మించి జీవితంలో ఎదగడానికి రంగు అడ్డం అంటే మనం యాక్సెప్ట్ చేయలేం. అలాంటి ఒక టాపిక్‌ను తీసుకొని కథ తయారుచేశారు సాయి రాజేష్. ఆ కథను దర్శకుడు సందీప్ రాజ్ కూడా గొప్పగా తెరపై ఆవిష్కరించలేకపోయారు.

సినిమా తొలి భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. హీరో, హీరోయిన్ల గురించి పరిచయం.. వాళ్ల కాలేజీ రోజులు.. సీనియర్స్‌తో గొడవలు ఇవే విషయాలను తొలి భాగంలో చూపించారు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు అసలు కథలోకి అడుగుపెట్టలేదు. ఇక ఇంటర్వెల్ తరవాత నుంచి ప్రేమకథ మొదలవుతుంది. అది కూడా రొటీన్‌గానే ఉంది. నల్లగా ఉండే ఒక అబ్బాయిని తెల్లగా అందంగా ఉండే అమ్మాయి ఎందుకు ప్రేమించిందో సరైన కారణాన్ని దర్శకుడు చూపించలేదు. ఆ అమ్మాయి అందం, చదువు, అంతస్తు.. అన్నింటిలోనూ ఆ అబ్బాయి కంటే ఎక్కువే. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిలో ఇష్టపడిన ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా!

పాలు అమ్ముతూ ఇంజినీరింగ్ చదువుతున్నాడు అనే ఒక్క పాయింట్‌తో ఆ అమ్మాయి ప్రేమలో పడిందంటే మనం జీర్ణించుకోవడం కష్టం. జయకృష్ణ, చాందిని ప్రేమలో పడిన తరవాత కూడా దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు పెద్దగా ఆకట్టుకోదు. దీనికి తోడు విలనిజం కూడా పండలేదు. హీరో పాత్రను ఎలివేట్ చేయడానికి పెట్టిన కాలేజ్‌లో స్పీచ్ సీన్ కూడా ప్రేక్షకుడికి మజా ఇవ్వదు. నిజానికి ప్రేమ కథల్లో ఎమోషన్‌కు ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ సినిమాలో దానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో తప్ప ప్రేక్షకుడు భావోద్వేగానికి గురయ్యే సందర్భాలు చాలా తక్కువ. అయితే, సినిమా మాత్రం ఎక్కడా అసభ్యత లేకుండా చాలా అందంగా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే సుహాస్, చాందిని తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా సుహాస్.. జయకృష్ణ పాత్రలో ఒదిగిపోయారు. తను పలికించే చిన్న చిన్న హావభావాలు కచ్చితంగా ప్రేక్షకుడి మనసును హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో సుహాస్ నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక చాందిని సైతం దూకుడుగా ఉండే అమ్మాయి పాత్రలో ఇమిడిపోయింది. సహజ నటనతో ఆకట్టుకుంది. సునీల్ పోషించిన రామరాజు పాత్ర నిరాశపరుస్తుంది. ఆ పాత్రలో క్రూరత్వాన్ని సునీల్ పండించలేకపోయారు అనేది నా భావన. ఆయన డైలాగులు చెబుతుంటే మళ్లీ ఆ పాత సునీలే కనిపించారు. ఈ సినిమాలో మంచి ఉపశమనం హర్ష. తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు.

‘కలర్ ఫోటో’కు ప్రధాన ఆకర్షణ, బలం కాల భైరవ సంగీతం. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి. మీరు సినిమా చూసిన తరవాత ఇంకా ఆ సంగీతంలో తేలుతూనే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కథను 1999 కాలంలోకి తీసుకెళ్లడానికి ఆర్ట్ డైరెక్టర్ పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. వెంకట్ ఆర్ శాఖమూరి ఛాయాగ్రహణం డీసెంట్‌గా ఉంది. ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. తక్కువ బడ్జెట్‌తో మంచి ఔట్‌పుట్ ఇచ్చారు నిర్మాతలు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా..
‘కలర్ ఫోటో’కు కాస్త కలర్ తక్కువైంది.