కరోనా వేళ క్రమశిక్షణ తప్పిన బౌలర్ ఆర్చర్‌పై వేటు.. జట్టు నుంచి ఔట్

Share Icons:
వెస్టిండీస్‌‌తో గురువారం రెండో టెస్టుకి గంటల ముందు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్‌పై వేటు పడింది. మాంచెస్టర్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. సౌథాంప్టన్ నుంచి అక్కడికి వచ్చే సమయంలో సెక్యూరిటీ ప్రొటోకాల్‌ని బ్రేక్ చేశాడు. దాంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడ్ని రెండో టెస్టు నుంచి తప్పించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

జోప్రా ఆర్చర్ చేసిన తప్పు ఏంటంటే..? సౌథాంప్టన్ వేదికగా గత ఆదివారం తొలి టెస్టు మ్యాచ్ ముగియగా.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాంచెస్టర్‌కి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. కానీ.. మార్గమధ్యంలో జోప్రా ఆర్చర్ తన ప్లాట్‌కి వెళ్లి తిరిగి జట్టుతో చేరే ప్రయత్నం చేశాడు. దాంతో.. అతడి జీపీఎస్‌ని ట్రాక్ చేసిన అధికారులు అడ్డుకుని ఐదు రోజులు సెల్ఫ్ ఇసోలేషన్ ఉండాలని అతనికి సూచించారు. ఈ ఐదు రోజుల్లో రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని.. రెండింటిలోనూ నెగటివ్ వస్తేనే తిరిగి జట్టులో ఆర్చర్‌ని అనుమతించనున్నట్లు ఈసీబీ తెలిపింది.

కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి బ్రేక్‌లు పడగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ని పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఈసీబీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపైకి నెల రోజుల ముందే విండీస్ టీమ్‌ని రప్పించిన ఈసీబీ.. వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్లకి కూడా క్యాంప్‌ని ఏర్పాటు చేసి.. వారిని కుటుంబ సభ్యులతో కూడా కలవనివ్వలేదు. మొత్తంగా ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలిన తర్వాతే ఆటలోకి ఈసీబీ అనుమతించింది. కానీ.. తాజాగా జోప్రా ఆర్చర్ తొందరపాటు కారణంగా ఈ బయో-సెక్యూర్ వాతావరణం మొత్తం దెబ్బతినే ప్రమాదంలో పడింది.

‘‘నేను చేసింది తప్పే.. నన్ను క్షమించండి. నేను చేసిన పని కారణంగా నాతో పాటు టీమ్, మేనేజ్‌మెంట్‌ని కూడా ప్రమాదంలో పడేశాను. ఈ బయో-సెక్యూర్ వాతావరణంలో ఉండి సిరీస్‌‌లో భాగమైనవారందరికీ నా బహిరంగ క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని జోప్రా ఆర్చర్ వెల్లడించాడు. సౌథాంప్టన్, మాంచెస్టర్ స్టేడియాలు మాత్రమే హోటల్‌తో అనుబంధంగా ఉండటంతో.. ఈ వేదికల్లోనే ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య సిరీస్‌ని నిర్వహిస్తున్నారు.