కరోనా లైవ్ అప్‌డేట్స్: వైద్యుడి ప్రాణాలు తీసిన కోవిడ్‌కు విరుగుడు ఔషధం

Share Icons:
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో సగం జీతం మాత్రమే ఇవ్వాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. మిగిలిన సగం జీతం ఆర్థిక పరిస్థితి సర్దుబాటు అయ్యాక చెల్లించనున్నట్లు తెలిపింది.

కోవిడ్19కు విరుగుడుగా మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు వేసుకున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మరణించిన ఘటన దేశంలో కలకలం రేపుతోంది. మరణించడానికి ముందు వాట్సాప్ గ్రూపులో ఆయన పెట్టిన మెసేజ్ వైద్య వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 కరోనా కేసులు నిర్ధారణ కాగా, అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 8 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి సంబంధించి మరి కొందరి నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని పాజిటివ్‌ కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 3,500 మందిని క్వారంటైన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు.

ప్రజల కోసం శానిటైజర్లు, మాస్కులను హోం డెలివరీ చేయాలని తెలంగాణ జైళ్లశాఖ నిర్ణయించింది. చర్లపల్లి జైలు నుంచి సరఫరా చేసే ఈ కిట్లో 2 శానిటైజర్లు (320 ml), 12 మాస్కులు, 2 హ్యాండ్ వాష్ బాటిళ్లు, 3 సబ్బులు, 2 ఫినాయిల్ బాటిళ్లు, ఉంటాి. వీటి ధర రూ. 900 మాత్రమే. వీటిని హైదరాబాద్ వాసులకు మాత్రమే అందజేస్తామని, ఒక కాలనీ నుంచి కనీసం 15 ఆర్డర్లు వస్తే, హోం డెలివరీ చేస్తామని జైళ్ల శాఖ సూపరింటిండెంట్ తెలిపారు.

నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కాలపరిమితిని జూన్‌ 30 వరకూ పొడగిస్తూ కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సోమవారం రాత్రి నుంచి ఏకంగా 17 కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నిర్ధారణ కాగా, గుంటూరు 9, విశాఖపట్నం 8, కృష్ణాలో 5, తూర్పుగోదావరిలో 4, అనంతపురంలో 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు ఒక్కో కేసు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒక్కొక్కిరికి రూ.20 పెంచుతున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పెంచిన వేతనాన్ని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద అందజేయనున్నట్టు ఆమె తెలిపారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 540 మంది మృత్యువాతపడ్డారు. దీంతో వైరస్‌తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 3017కు పెరిగింది. ఇక వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 1,63,000లకు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సకు ఆస్పత్రులే కరవయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ భారీ నౌకను ఆసుపత్రిగా మార్చింది. సోమవారం హడ్సన్‌ నదిలో ఒడ్డుకు చేరిన ఈ నౌకను రెండు రాష్ట్రాల ప్రజలు నదికిరువైపుల నిలబడి సంతోషంతో స్వాగతం పలికారు.

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండగా.. బాధితుల్లో 138 మంది కోలుకున్నారు. మహమ్మారిని జయించిన వారిలో కేరళకు చెందిన 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య (88) కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ వెల్లడించారు. బాధితులు ఇద్దరికీ డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఇతర వయోభార సమస్యలున్నా వైరస్‌ నుంచి కోలుకున్నారని ఆమె తెలిపారు.

హాస్పిటల్స్‌ను సత్వరం ఇన్‌ఫెక్షన్‌ రహితంగా మార్చగల సరికొత్త మెషీన్ ‘సైటెక్‌ ఎయిర్‌ఆన్‌’అందుబాటులోకి వచ్చింది. కూలర్‌ మాదిరిగా ఉన్న మెషీన్.. ప్రతి 8 సెకన్లకు 10 కోట్ల నెగిటివ్‌ అయాన్లను వెదజల్లుతుంది. తద్వారా కేవలం గంటలోనే హాస్పిటల్ గదుల్లో వైరస్‌ల ప్రభావాన్ని 99.7% తగ్గిస్తుంది. వైరస్‌ల ఉపరితలంపై ఉండే ప్రోటీన్‌ను ఈ యంత్రం నుంచి వచ్చే డిటర్జెంట్‌ ప్రాపర్టీ ధ్వంసం చేస్తుంది. కార్బన్‌ మోనాక్సైడ్‌, నెట్రోజన్‌ డై ఆక్సైడ్‌ వంటి కలుషిత వాయువులను నిర్వీర్యం చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా సాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాది మంది పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో దీని వ్యాప్తి రోజుకు సగటున 500గా నమోదయ్యింది. తొలి లక్ష 67 రోజుల్లో చేరుకుంటే, రెండో లక్షను కేవలం 11 రోజుల్లోనే చేరింది.

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్నకేసులను చూస్తే సామూహిక వ్యాప్తి దశకు వైరస్ చేరుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 200కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 11 మంది మృతిచెందారు. అయితే, దేశంలో కరోనా వైరస్ ఇంకా సమూహాలలో వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. స్థానిక సంక్రమణ దశలోనే ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం కొత్తగా 227 మందిలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,251కి చేరింది.

తెలుగు రాష్ట్రాలను కరోనా పరేషాన్ వెంటాడుతోంది. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోవడం టెన్షన్ పెడుతోంది. ఈ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

తెలంగాణలోని కరోనా మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణలో కరోనా వైరస్‌తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, గ్లోబల్ హాస్పిటల్లో ఒకరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి ద్వారా వైరస్ మరింత మందికి సోకే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంతకూ ఏమైందంటే.. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌లో మత పరమైన ప్రార్థనలు నిర్వహించారు.
.

దేశంలో త్వరలోనే అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధిస్తారని వస్తున్న సోషల్‌ మీడియా వార్తలు అవాస్తవమని భారత సైన్యం తెలిపింది. కరోనా వైరస్‌ (కోవిడ్ 19)ను కట్టడి చేసేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే నెల్లో అత్యయిక స్థితి విధిస్తుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియా బులెటిన్‌ను ద్వారా వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో కరీంనగర్‌కు చెందిన రెండు కేసులు కూడా ఉన్నాయి. కోవిడ్‌కు చికిత్స పొందిన 13 మందికి నెగటివ్ రావడంతో.. చెస్ట్ హాస్పిటల్ నుంచి వారిని డిశ్చార్జ్ చేశారు.

ఒకేసారి ఆరుగురు కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేలా నేవల్‌ డాక్‌యార్డు ఉద్యోగులు ‘సిక్స్‌వే మల్టీ ఫీడ్‌-ఆక్సిజన్‌’ పరికరాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌పై ఒక రోగికి మాత్రమే ప్రాణవాయువును అందిస్తున్నారు. ఇప్పటికే నౌకాదళ ఆసుపత్రి ‘ఐఎన్‌ఎస్‌ కల్యాణి’లో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. విజయవంతమైందని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ వర్గాలు తెలిపాయి.