కడసారి చూపునకూ కరోనా భయం.. ఎన్నడూ చూడని అంతిమయాత్ర!

Share Icons:
రోనా సాగిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు ఎదుటివారిని కలవాలంటేనే జంకుతున్నారు. పొరపాటున తుమ్మితే, దగ్గితే.. ఇక అంతే. కరోనా లక్షణాలేమో అని జంకుతున్నారు. బాధితులను హీనంగా చూస్తున్నారు. మాస్కు ధరించలేదని ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి బయటకు గెంటేసిన ఘటన కొండాపూర్‌లోని హెరిటేజ్ మాల్‌లో ఇటీవల చోటు చేసుకుంది. కరోనా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇలాంటి విషాదాలే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఆలోచింపజేస్తోంది.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగార్‌బేస్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి హన్మంతు (65) అనారోగ్యంతో బుధవారం (మార్చి 25) రాత్రి మృతి చెందారు. గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రే బంధుమిత్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే.. కరోనా కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలకు హాజరవడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. వచ్చినవారు కూడా దూరం నుంచే మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు. వాళ్లు కూడా దాదాపుగా అందరూ మగవాళ్లే.

Must Read:

గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలకు సిద్ధం చేయగా.. పాడె మోసేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో కుటుంబసభ్యులు ఓ ట్రాక్టర్‌ ఏర్పాటు చేసి మృతదేహాన్ని అందులో ఉంచి అంత్యక్రియలకు తరలించారు. అంతిమయాత్రలో పాల్గొన్నఆ పది మంది కూడా సామాజిక దూరం పాటించి ముందుకు సాగారు. సాధారణ పరిస్థితుల్లో మాదిరిగా బంధువుల రోదనలు, డప్పు చప్పుళ్లు ఏవీ కానరాలేదు. ఇలా వెళ్లి అలా అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగొచ్చేశారు.

కరోనా మహమ్మారి ప్రజలను ఎంతలా భయపెడుతుందో చెప్పడానికి మచ్చుతునక ఈ ఘటన. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అని చెప్పవచ్చు. సామాజిక దూరాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తేనే కరోనా వైరస్‌ను మన గడ్డ మీద నుంచి పూర్తిగా తరిమేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దాని దుష్పరిణామాలు ఊహకు కూడా అందవు.

Also Read: